
ద్వాదశ జ్యోతిర్లింగాలలోని శివనామములలో ఒక పేరు సోమనాథుడు. సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న సోమనాథ్‌లో ఉంది. సోమనాథ్ ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రముగా విరాజిల్లుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ క్షేత్రంపై పదహారుసార్లు దాడులు జరిగాయి, అయినా అన్నిసార్లూ పునర్నిర్మాణం జరిగింది. ఈ పుణ్యక్షేత్రం శివభక్తులకు మాత్రమే కాదు విష్ణుభక్తులకు సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతరాన్ని చాలించినట్లు ప్రతీతి.

అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం సోమనాథ్. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. ఈ ఆలయానికున్న చరిత్ర చెప్పనలవికాదు. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్ధానికి చెందినది.

స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు

ఈ దేవాలయం భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒక దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది. ఆ కాలంలో ఇక్కడ వున్న అపార ధనరాసులే దండయాత్రలకి కారణాలని చెప్పవచ్చు. ఈ ఒక్క ఆలయం నుండే గజిని మహ్మద్ 6 టన్నుల కంటే ఎక్కువగా బంగారాన్ని దోచుకున్నాడు. అంతేకాదు విజయం సాధించిన ఘజనీ సోమనాథ్ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి, ఆలయాన్ని ధ్వంసం చేసి వెళ్లిపోయాడు.

ఈ ఆలయానికి సంబంధించి మరో రెండు అద్భుతాలు కూడా ఉన్నాయి. సోమనాథ్ ఆలయం సముద్ర ఒడ్డుకు దగ్గర ఉన్న ఆలయం కాబట్టి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం భారీ సముద్రపు అలలు సోమనాథ్ ఆలయ మెట్లను ముద్దాడుతాయి. ఇది నేటి వాస్తు శిల్పులకు సైతం అర్థం కాని పజిల్ లాగా ఉంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గర్భ గుడి యొక్క లింగం. మన దేశంలోని ఏ ఆలయాలలో లేని అద్భుతం ఇది. అది ఏంటంటే ఆలయ గర్భగుడి లింగం ఇతర దేవాలయాల మాదిరిగా నేల మీద ఉండదు.