
శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో.. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.స్వామి వారి ధర్మదర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది.

ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణోత్బవం ఇక నుంచి స్వర్ణ సింహాసనంపై జరగనుంది. పసిడి వర్ణంలో ధగధగ మెరిసే ఈ సింహాసనంపై దేవేరితో కలిసి స్వామివారు నిత్యకల్యాణ పూజలను అందుకోనున్నారు. ఈ నిత్యకల్యాణం వేడుకలో ఈ బంగారు సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా మారనున్నది.

ఆలయ మండపంలో బంగారు సింహాసనంపై ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యకల్యాణ క్రతువును నిర్వహించనున్నామని దేవస్థాన ఆలయ ఈవో తెలిపారు.ఈ సింహాసనానికి సామల, వీరమణి స్వామి దంపతులు సహా ఆలయ ఈవో పూజలు నిర్వహించారు.

బంగారు పూతతో తయారు చేసిన స్వర్ణ సింహాసనం తయారీకి సుమారు రూ.18లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు. ఈ స్వర్ణ సింహాసనాన్ని స్వామివారికి న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారతీయలు సామల, వీరమణి స్వామి దంపతులు కానుకగా అందజేశారు.

మరోవైపు ఆదివారం రోజున శ్రీలక్ష్మీనరసింహ స్వామిని సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులతో దర్శన వరుసలు, ప్రసాద కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో భక్తుల ఆరాధనలు, దైవదర్శనాలతో సందడి నెలకొంది. ఆస్థానపరంగా స్వయంభువులకు నిత్యారాధనలు జరిగాయి.