
కోట్లాదిమంది హిందువుల కల ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సరయు నది తీరంలో అందంగా కొలువుదీరుతోన్న రామ మందిర నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మందిర నిర్మాణం పనులకు సంబంధించిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఈ ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 2023 ఏడాది చివరికి ఈ మందిరం సిద్ధమవుతుందని తెలిపారు

నిర్మాణంలో ఉన్న ఆలయానికి సంబంధించిన రెండు ఫోటోలు చూస్తుంటే ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. సుమారు రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. భారతీయ సంస్కృతిని తెలియజేసే చిత్రాలతో కూడిన కుడ్యాలను రామమందిరంలో నిర్మిస్తున్నారు

2023 చివరి నాటికి రామ మందిరం పాక్షికంగా సిద్ధమవుతుందని.. అంటే డిసెంబర్ 2023 నాటికి రాముడి గర్భగుడి సిద్ధమవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రంలోని ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి తర్వాత భక్తుల కోసం గర్భగుడి తెరవబడుతుంది. 2024 మకర సంక్రాంతి తర్వాత నుంచి అయోధ్య రాముడిని దర్శించుకొనేందుకు భక్తులను అనుమతించనున్నారు.

గర్భగుడిలో నిర్మించిన వేదికపై రాంలాలా విగ్రహం 51 అంగుళాలు ఉంటుంది. వాస్తును పరిగణనలోకి తీసుకొని రామ మందిరం, పరిసరాల విస్తీర్ణాన్ని 67 ఎకరాల నుంచి 110 ఎకరాలకు పెంచినట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి

పురాతన హిందూ దేవాలయాలతో సమానంగా రామాలయాన్ని నిర్మించడం ట్రస్ట్‌కు చాలా కష్టమైన పని. అయోధ్యలోని రామ మందిరం గోడలు అనేక మతపరమైన ఇతివృత్తాలను వర్ణిస్తాయి. న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్‌తో సహా మత పెద్దలు , కళా నిపుణుల బృందం ఇతివృత్తాలపై నిర్ణయం తీసుకుంటుంది. గోడలను ఒకదానితో ఒకటి పట్టుకోవడానికి తుప్పు పట్టకుండా ఉక్కు జాయింట్‌లకు బదులుగా రాగి జాయింట్‌లు ఉపయోగిస్తున్నారు.

అయోధ్య రామయ్యకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 23న జలాభిషేకం నిర్వహించనున్నారు. ఈ జలాభిషేకానికి 155 దేశాల్లోని నదుల నుంచి జలాన్ని సేకరించనున్నారు. ఇప్పటికే రామభక్తుడు విజయ్ జొలీ నేతృత్వంలోని బృందం ఆయా దేశాల నదుల నుంచి జలాన్ని సేకరిస్తున్నారని.. త్వరలో సీఎం యోగికి అందిస్తారని తెలిపారు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.

ఈ జలాల్లో పాకిస్థాన్ లో ప్రవహిస్తున్న రావి నది జలం కూడా ఉంది. ఈ నది నీటిని పాకిస్థాన్ లోని హిందువులు సేకరించి.. దుబాయ్ కు పంపించారు. అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకున్నాయి.

మణిరామ్ దాస్ చావ్నీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు.