
మేషం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛపట్టిన చంద్రుడిని రాశ్యధిపతి కుజుడు, లాభాధిపతి శని వీక్షించడం వల్ల అనుకోకుండా, అప్రయత్నంగా విదేశీ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ మూడు రోజుల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.

కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం ఒక విశేషం కాగా, ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు, భాగ్య స్థానం నుంచి శనీశ్వరుడు వీక్షించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ప్రయత్నాలకు ఈ మూడు రోజుల్లో శ్రీకారం చుట్టడం మంచిది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టిన లాభాధిపతి చంద్రుడిని కుజ, శనులు వీక్షించడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఈ మూడు రోజుల్లో ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలను ముమ్మరం చేయడం వల్ల తప్పకుండా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న చంద్రుడిని రాశ్యధిపతి కుజుడు, పంచమంలో ఉన్న శనీశ్వరుడు వీక్షించడం వల్ల అపారమైన ధన లాభం కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు వంటి వాటి వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. రావ లసిన సొమ్ము, బాకీలు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్ఛపట్టిన చంద్రుడిని శని, కుజులు వీక్షించడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆశించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

కుంభం: ఈ రాశికి చంద్రుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛపట్టడం ఒక విశేషం కాగా, దాన్ని రాశ్యధిపతి శని ధన స్థానం నుంచి, కుజుడు భాగ్య స్థానం నుంచి వీక్షించడం మరో విశేషం. దీనివల్ల ఈ రాశివారికి ఈ మూడు రోజుల కాలంలో ఎటువంటి ఆదాయ వృద్ధి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.