
మేషం: ఈ నెల 11న ఈ రాశిలోకి చంద్రుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారి మనసులోని కోరికలు క్రమంగా నెరవేరడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కాలన్న ఆశయం నెరవేరుతుంది. వీరు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల ఫలితం ఉంటుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సొంత ఇంటి ప్రయత్నాల వల్ల శీఘ్ర ఫలితాలుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది.

వృషభం: ఈ రాశివారు ఈ ఏడెనిమిది రోజుల కాలంలో ఆదాయ వృద్ధి, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చేపట్టడం వల్ల కలలో కూడా ఊహించని ఫలితాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావా దేవీలతో సహా ఏ రకమైన ఆదాయ ప్రయత్నం చేపట్టినా భారీగా లాభాలు కలుగుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి, స్త్రీమూలక ధన లాభం వంటివి కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు సైతం అందడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మిథునం: ఈ రాశికి ధనాధిపతి అయిన చంద్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.

కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు ఎనిమిది రోజుల పాటు తనకు అనుకూలమైన స్థానాల్లో అత్యధిక బలంతో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తల్లితండ్రుల నుంచి రావలసిన వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

కన్య: ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడికి బలం పెరగడం వల్ల ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా సమర్థతకు, ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయంలో అంచనాలను మించిన వృద్ధి ఉంటుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది.

తుల: దశమాధిపతిగా ఈ రాశికి అత్యంత శుభుడైన చంద్రుడికి బలం పెరగడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడానికి, ఆదాయం భారీగా పెరగడానికి బాగా అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి.