
జ్యోతిష్యశాస్త్రం రంగులు మనిషి భావోద్వేగాలు, ప్రవర్తన , మొత్తం శక్తిని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ప్రతి రాశికి ప్రయోజనకరమైన లేదా హానికరమైన రంగులుగా పరిగణించబడే నిర్దిష్ట రంగులు ఉంటాయని వెల్లడించింది. కొన్ని రంగులను ధరించడం వలన బలం పెరిగితే తప్పుడు రంగు దుస్తులు ధరిస్తే సవాళ్ళను, ప్రతికూల శక్తులను తీసుకొస్తుంది. కనుక ఏ రాశి వారు ఎటువంటి రంగుల దుస్తులు ఎంచుకోకూడదో తెలుసుకుందాం..

మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఖచ్చితంగా నలుపు రంగుకు దూరంగా ఉండాలి. పొరపాటున కూడా వీరు నలుపు రంగు దుస్తులను దరించవద్దు. ఎందుకంటే ఈ రంగు ఈ రాశికి వారికి అంత శుభప్రదం కాదు. ఏ పని మొదలు పెట్టినా.. ఆ పని ఎక్కువ ఆలస్యానికి కారణం కావచ్చు.

వృషభ రాశి: వీరు జీవితంలో రాహు ప్రభావాన్ని పెంచకుండా ఉండటానికి ముదురు నీలం రంగుకు దూరంగా ఉండండి. ఈ రంగుని దూరంగా పెట్టడం వలన మనస్సును ప్రశాంతంగా ఉంటుంది. బ్లూ కలర్ దుస్తులు ధరిస్తే వీరిపై రాహు ప్రభావం ఎక్కువగా ఉండి మానసికంగా ఇబ్బందులు పడతారు.

మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు పసుపు, మెరూన్ రంగు దుస్తులను నివారించండి. బృహస్పతి పసుపుతో సంబంధం కలిగి ఉన్నందున.. శత్రువులు మీ జీవితంలోకి రావచ్చు. అంతేకాదు వీరి జాతకంలో కుజ గ్రహం బలోపేతం కాకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా పసుపు, మెరూన్‌కు దూరంగా ఉండండి.

కర్కాటక రాశి: నలుపు రంగును నివారించండి. ఎందుకంటే ఈ రంగు వీరిని ప్రతిదాని పట్ల మరింత భావోద్వేగానికి గురయ్యేలా చేస్తుంది. సున్నితంగా మారుస్తుంది.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వారికి అనేక రంగులు సరిపోతాయి. అయితే ఎరుపు రంగు దుస్తులను నివారించండి. ఈ రంగు దుస్తులు ధరిస్తే కుజుడు బలపడతాడు. దీంతో వీరు ఎక్కువ దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది.

కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు పాస్టెల్ లేదా లేత రంగులకు దూరంగా ఉండండి. ఎందుకంటే వీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ప్రతిస్పందించే స్వభావాన్ని కలిగి ఉంటారు. కనుక వీరు లేత రంగుల కంటే ముదురు రంగులు ఎంచుకోవడం మంచిది.

తులా రాశి: ముదురు నీలం , నారింజ రంగులను నివారించండి. ఈ రంగులను ధరిస్తే రాహువు ప్రభావం పెరుగుతుంది. చూడగానే ఆకర్షించే విధమైన రంగుల దుస్తులను దరించ వద్దు.

వృశ్చిక రాశి: వీరి జాతకంలో శనిశ్వర ప్రభావం పెరగకుండా ఉండాలంటే నలుపు రంగుకి దూరంగా ఉండడం ముఖ్యం.

ధనుస్సు రాశి: వీరు తెల్లని దుస్తులు ధరించడం వద్దు. ఎందుకంటే ఈ రంగు చంద్రుడి ప్రభావాన్ని పెంచుతుంది. మిమ్మల్ని చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది.

మకర రాశి: ఆకుపచ్చ రంగుకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ రంగు వీరికి బుధ ప్రభావాన్ని పెంచుతుంది. భాదను కలిగించే విషయాలు వినాల్సి రావచ్చు. కనుక ఈ రంగుకి దూరంగా ఉండటం మంచిది.

కుంభ రాశి: పసుపు రంగుకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ రంగు వలన వీరిపై బృహస్పతి ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు. దీంతో అవాంఛిత విషయాల పట్ల దృష్టి కేంద్రీకరించ వచ్చు. వీరు ప్రతికూల దృష్టిని ఆకర్షించవచ్చు.

మీన రాశి: ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానుకోండి ఎందుకంటే అది కుజ గ్రహాన్ని ప్రేరేపిస్తుంది. దీంతో మీరు చాలా దూకుడు స్వభావం ఉన్నవారిగా మారవచ్చు.