
కోరుకున్న ఉద్యోగం కోసం కష్టపడి పని చేయాలి. అదే సమయంలో దైవానుగ్రహం కూడా ఉండాలి. జాతకంలో గ్రహాల కలయిక వలన కొందరు ఎంత కష్టపడినా శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. దీంతో నిరాశకు లోనవుతూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపధ్యంలో జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కోరుకున్న ఉద్యోగం కోసం కొన్ని పరిహారాలను చేయడం వలన ఉద్యోగ సమస్య పరిష్కరం అవుతుంది. తద్వారా నిరుద్యోగ సమస్య తీరడమే కాదు.. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఈ రోజు నిరుద్యోగుల సమస్యను తీర్చే కొన్ని అద్భుతమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం..

హనుమంతుడి పూజ: రామ భక్త హనుమాన్ సంకట మోచనుడు. నమ్మి కోరి కొలిస్తే ఎటువంటి కష్టాలనైనా తీర్చే దైవం.. కనుక ఉద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు హనుమంతుడిని మంగళవారం రోజున పూజించండి. ప్రతి మంగళవారం హనుమంతుడి ఆలయంలోకి వెళ్లి స్వామిని పూజించి తమలపాకులు సమర్పించి సుందరకాండ పారాయణం చేయండి. అంతేకాదు హనుమాన్ చాలీసాను 7 సార్లు పారాయణం చేయండి. హనుమంతుడికి ఆవు నెయ్యితో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుందని నమ్మకం.

శివుడిని పూజించండి: ఎవరైనా ప్రభుత్వం కోసం ప్రయత్నిస్తుంటే.. మీ ప్రయత్నాలు ఫలించాలంటే భోలాశంకరుడి దయ ఉండాల్సిందే. శివుడిని పూజించడమే కాదు.. శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. బియ్యం సమర్పించండి. ఇలా 41 రోజులు చేయడం వలన శివయ్య అనుగ్రహంతో మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.

గణేశుడి పూజ: విఘ్నాలకధిపతి వినాయకుడిని నిరుద్యోగులు రోజూ పూజించడం వలన ఉద్యోగంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతి బుధవారం వినకుడికి దర్భలను సమర్పించండి. అంతేకాదు ఇంటర్వ్యుకి వెళ్ళే సమయంలో గణపతిని పూజించి వక్క, లవంగాలు వినాయకుడికి సమర్పించి .. వాటిని మీతో తీసుకుని వెళ్ళండి.

సూర్య భగవానుడి పూజ: సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పుజిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాలకు అధిపతి సూర్యుడిని పూజించడం వలన కెరీర్ లో సక్సెస్ సొంతం అవుతుంది. ఉద్యోగం కోసం రోజూ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అందులో మందారం పువ్వులు వేయండి. ఆదివారం మాంసాహారం తినవద్దు. ఉప్పు లేని ఆహారం తినండి. ఇలా చేయడం వలన ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి.

విష్ణువుకి పూజ: లోక రక్షకుడు శ్రీ మహా విష్ణువుని పూజించడంతో పాటు కొన్ని రకాల పరిహారాలను చేయడం కూడా తగిన ఫలితాలను అందిస్తుంది. విష్ణువును పూజ చేయడంతో పాటు పేదలకు ఆహారం అందించడం. పసుపు వస్తువులను దానం చేయడం వలన జాతకంలో గ్రహాల వల్ల కలిగే అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

రావి చెట్టును పూజించండి : ఉద్యోగం రాక ఇబ్బంది పడుతుంటే.. ప్రతి గురువారం అరటి చెట్టుని పుజిచండి. అంతేకాదు త్రిమూర్తులు కొలువైన రావి చెట్టుకు నీరు సమర్పించి, పూజించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ఈ పరిహారాలు చేయడం వలన ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.