
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. వీరి కోసం ఏపీ టూరిజం శాఖ, టీటీడీ కలిసి ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించాయి. దీంతో శ్రీవారి భక్తులు తక్కువ ధరకే చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు.

తిరుపతితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆలయాలను ఈ ప్యాకేజ్ ద్వారా దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా వెళ్లినవారికి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆలయాల్లో్ దర్శన భాగ్యం కల్పిస్తారు. అలాగే ఆలయాల విశిష్టత, చరిత్ర తెలిపేందుకు ఒక గైడ్ కూడా ఉంటారు. ఈ బస్సుల్లో టికెట్ ఛార్జీని రూ.550గా నిర్ణయించారు.

అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు వేణుగోపాలస్వామి, పల్లికొండేశ్వరస్వామి, వేదనారాయణస్వామి ఆలయం, నగరిలోని కరియ మాణిక్య స్వామి, బుగ్గలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాలను సందర్శించవచ్చు. ప్రతీ రోజు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని ఏపీ టూరిజం శాఖ స్పష్టం చేసింది.

ఇక తిరుపతిలోని స్థానిక ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ బస్సులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు సర్వీసులు అందిస్తాయి. వీటిల్లో్ టికెట్ ధరను రూ.250గా నిర్ణయించారు. ఈ బస్సుల్లో వెళితే తిరుచానూరు పద్మావతి అమ్మవారు. కపిలేశ్వరస్వామి, వకుళమాత, కల్యాణ వెంకటేశ్వరస్వామి, ఆగస్తీశ్వర స్వామి, గోవిందరాజుల స్వామి ఆలయాను సందర్శించుకోవచ్చు.

ఇక శ్రీకాళహస్తి వెళ్లాలనుకునే భక్తుల కోసం రూ.450 ప్రత్యేక ప్యాకేజ్, కాణిపాకం వెళ్లాలనుకునేవారికి రూ.550 ధరతో ప్యాకేజ్ తీసుకొచ్చారు. తిరుపతిలో ఉదయం 9 గంటలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు 9848007033, 08772289123 నెంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ తెలిపింది.