
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేకం ఆదివారంనాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు

శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.

కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. పురుష సూక్తంలోని మంత్రాల్లో స్వామివారిని ”సహస్రశీర్ష పురుషుడు” అని స్తుతిస్తారు.

ఈ సంవత్సరం భక్తులను జ్యేష్ఠాభిషేక సేవకు అనుమతించారు. ఇదిలా ఉండగా నేడు ముత్యాలకవచంతో, మంగళవారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీలోని ట్రస్ట్‌లకు వివిధ సంస్థల నుండి రూ.3.20 కోట్లు ఆదివారం ఉదయం విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు అందించారు. అదేవిధంగా హైదరాబాదుకు చెందిన హానర్ హోమ్స్ సంస్థ యాజమాన్యం బాలచంద్ర, స్వప్న కుమార్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందించారు.