- Telugu News Photo Gallery Spiritual photos 2026 Aquarius Yearly Forecast: Key Astrological Insights and Life Changing Turns
2026లో కుంభ రాశి ఫలితాలు.. వీరి జీవితంలో అన్నీ కొత్త మలుపులే!
2026లో కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీరి జీవితంలో 2026 కొత్త మలుపులను తీసుకొస్తుంది. కుంభ రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని చివరి దశలో ఉన్నప్పటికీ,రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు. వీరికి కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. మీరు దేనిలో అయినా సరే ప్రణాళిక ప్రకారం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు. మానసికంగా కూడా మీకు ఈ సంవత్సరం బాగుంటుంది.
Updated on: Nov 24, 2025 | 3:37 PM

ఈ రాశి వారికి గురు గ్రహ గోచారాన్ని పరిశీలిస్తే, వీరికి జనవరి నుంచి మే వరకు గురుడు ఐదవ స్థానంలో, మిథున రాశిలో ఉంటాడు. అందువలన వీరికి ఈ సమయంలో వివాహం, విద్య, సంతానం విషయంలో సానుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు ఆరవ స్థానంలో, కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఈ సమయం కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసొచ్చే సమయం అని చెప్పాలి. వీరు పడిన కష్టానికి ఈ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ శత్రువులపై విజయం సాధిస్తారు.

అక్టోబర్ 31 తర్వాత జనవరి 24, 2027 వరకు గురుడు ఏడవ స్థానమైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో సంబంధాలు మెరుగుపడతాయి, జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ప్రేమికులు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకునే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి వివాహం కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో వివాహం నిశ్చయం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

ఇక కుంభ రాశి వారికి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 వరకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కుజ గ్రహం వీరికి 12వ స్థానమైన మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కానీ త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది,అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంట. రాహుకేతువులు డిసెంబర్ 4 వరకు రాహువు జన్మరాశిలో, కేతువు ఏడవ స్థానంలో ఉంటారు. డిసెంబర్ 5 నుండి రాహువు వ్యయస్థానానికి, కేతువు ఆరవ స్థానానికి మారుతారు. ఈ మార్పు మిమ్మల్ని ఆధ్యాత్మిక దిశగా నడిపిస్తుంది.

వృత్తి, ఉద్యోగ రంగాల్లో జూన్ నుండి అక్టోబర్ మధ్య పదోన్నతులు, గౌరవం, చిన్న చిన్న అవార్డులు, రివార్డులు పొందే అవకాశాలు అధికం. గతంలో గుర్తింపు పొందని వారికి ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు సిబ్బందిపై నమ్మకం ఉంచాలి, అధిక నియంత్రణ తగ్గించుకోవాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అప్పులు జూన్ నుండి అక్టోబర్ మధ్య తీర్చుకునే అవకాశం ఉంది. ఆదాయంలో స్థిరత్వం పెరుగుతుంది.

ఇక కుంభ రాశి వారికి జనవరి 15 నుంచి 30 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. మే మొదటి వారం, నాల్గవ వారం , సెప్టెంబర్ మొదటి మూడు వారాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇక ఈ రాశి వారు మార్చి నాలుగో వారం, ఏప్రిల్ రెండో వారం, డిసెంబర్ మూడవ వారంలో ముఖ్యమైన పనుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇక మొత్తంగా ఈ సంవత్సరం కుంభ రాశి వారు తమ కలలు నెరవేర్చుకోగలుగుతారు. చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ కృషినే మీ జీవితాన్ని కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది.



