- Telugu News Photo Gallery Science photos Indian discoveries let us learn about indias six amazing discoveries to the world
Indian discoveries: సాంకేతిక భారతం.. ప్రపంచానికి భారతదేశం అందించిన ఆరు అద్భుత ఆవిష్కరణలు!
Indian discoveries: ప్రపంచానికి భారతదేశం అందించిన ఆవిష్కరణలతో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అటువంటి అద్భుతమైన ఆవిష్కరనల్లో కొన్ని ఆవిష్కరణల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Jun 28, 2021 | 1:41 PM

సాంకేతికత విషయంలో ప్రపంచంలో భారత్ స్థానం చిన్నది కాదు. ఇప్పుడు గొప్పగా ఉపయోగపడుతున్న సైన్స్ ఆవిష్కరణలలో ఎక్కువ శాతం భారతదేశ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల ఆధారంగా రూపుదిద్దుకున్నవే. అద్భుతమైన మేదోసంపత్తు భారత్ సొంతం. ప్రపంచానికి భారత్ అందించిన ఆరు అద్భుతమైన ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.

1. రేడియో ప్రసారాలు: రేడియోను కనిపెట్టింది గుగ్లిల్మో మార్కొనీ అని అంటారు. కానీ, దానికన్నా చాలా ముందే భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మిల్లీమీటర్ శ్రేణి రేడియో తరంగాలను ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఈ తరంగాలను మందుగుండును పేల్చేందుకు, గంట కొట్టేందుకు అప్పట్లో వాడేవారు. నాలుగేళ్ల తరువాత టెలిఫోన్ డిటెక్టర్ రూపంలో వాటిని వినియోగించారు. తరువాత వైర్‌లెస్ రేడియో ప్రసారాలు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయి.

2.ఫైబర్ ఆప్టిక్స్: ఇంటర్నెట్ ఇంత వేగంగా అభివృద్ధి చెండానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకే ఈ ఇంటర్నెట్ విప్లవం సాధ్యం అయింది. ఈ ఫైబర్ ఆప్టిక్ ను తయారు చేసింది పంజాబ్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త నరీందర్‌సింగ్.. ఈయన 1955-65 మధ్య రాసిన అనేక సాంకేతిక అంశాలలో 1960లో సైంటిఫిక్ అనే అమెరికా పత్రికలో ప్రచురితమైన వ్యాసం ఆధారంగా ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ రూపుదిద్దుకుంది. అందుకే ఆయన్ని 'ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడి'గా పిలుస్తారు.

3.యోగా: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన యోగాను అందించింది భారతదేశమే. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించడంలో యోగా అద్భుతంగా పనిచేస్తుందని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నమ్ముతారు. భారతదేశ వారసత్వ సంపదగా చెప్పుకోవలసిన యోగాని స్వామి వివేకానంద (1863-1902) పశ్చిమ దేశాలకు పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారు. ఐక్యరాజ్యసమితి కూడా జూన్ 21 తేదీని యోగాదినోత్సవంగా ప్రకటించింది.

4.వైకుంఠపాళి: పబ్జీ లాంటి కంప్యూటర్, మొబైల్ గేమ్స్ తెలియని వారుండరు. ప్రస్తుతం గేమింగ్ రంగం దూసుకుపోతోంది. అయితే, ఈ కంప్యూటర్ ఆటలకు ప్రేరణ మన వైకుంఠపాతళి అని చెబుతారు. విదేశాల్లో వైకుంఠపాళి అంటే విపరీతమైన క్రేజ్. ఈ ఆటను వ్యక్తిత్వ వికాస బాటగా విదేశాల్లో భావిస్తారు. ఈ ఆటలో ఉండే నిచ్చెనను మంచి అలవాట్లకు ప్రతీకగా..పాములను చెడు వ్యవహారాలకు నిదర్శనంగా అభివర్ణిస్తారు. అందుకే చాలా దేశాల్లో పిల్లలకు వైకుంఠపాళి ఆడడం నేర్పిస్తారు.

5. షాంపూ: ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల విషయంలో మన దేశం పూర్వకాలం నుంచీ ఎంతో ఘనత సాధించింది. ఆ కోవలోనే వచ్చిన ఆవిష్కరణ షాంపూ. ఎప్పుడో 15వ శతాబ్దంలో ఆరోగ్యకరమైన మెరిసె జుట్టుకోసం మనవాళ్ళు షాంపూ వాడేవారు. ఆకులు, పండ్ల విత్తనాలతో వీటిని తయారు చేసేవారు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో వ్యాపారులు ఇక్కడి నుంచి ఐరోపా దేశాలకు షాంపూలను తీసుకువెళ్ళేవారు.

6.యూఎస్‌బీ పోర్టు: యూఎస్‌బీ అంటే దాదాపుగా అందరికీ తెలిసిందే. దీనితో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానితో ఒకటి అనుసంధానించుకునే వీలుంటుంది. యూఎస్‌బీ పోర్ట్ ఆవిష్కరణ కంప్యూటర్ టెక్నాలజీ లో విపరీతమైన మార్పు తీసుకు వచ్చింది. యూఎస్‌బీ పోర్టును ప్రపంచానికి పరిచయం చేసింది మనదేశమే. ఇప్పుడు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరానికీ యూఎస్‌బీ పోర్టు తప్పనిసరి. వైర్‌లెస్ టెక్నాలజీ ఎంత విస్తరించినా యూఎస్‌బీ ఇప్పటికీ తప్పనిసరిగానే ఉంటోంది.





























