
రాయల్ బెంగాల్ టైగర్.. ఇది మన ఇండియా జాతీయ జంతువు. ఈ పులుల ఒంటిపై పసుపు లేదా నారింజ రంగు చర్మం మీద నలుపు చారలు ఉంటాయి. మగ పులి సుమారు 265 కిలోలు బరువు ఉంటుంది. ఆడ పులి 140 నుండి 165 కిలోల మధ్య ఉంటుంది. ఈ పులులు సుమారు 20 నుండి 25 సంవత్సరాలు జీవిస్తాయి. అవి అడవిలో వందల కిలోమీటర్లు నడవగలవు. ఒకేసారి 2 లేదా 3 పిల్లలకు జన్మనిస్తాయి.

బ్లాక్ పాంథర్.. బ్లాక్ పాంథర్ అంటే నిజానికి నల్లగా కనిపించే చిరుతపులే. కొన్ని చిరుతలకు మెలనిజం అనే ప్రత్యేక లక్షణం ఉంటుంది. దానివల్ల అవి నల్లగా కనిపిస్తాయి. ఈ జంతువు చెట్లపై చాలా వేగంగా ఎక్కగలదు. తన చూపుతో దూరాన్ని స్పష్టంగా చూస్తూ వేటను పట్టుకోవడంలో దీనికి మంచి నైపుణ్యం ఉంది.

భారతీయ చిరుతపులి.. ఇది ఇండియాలోని చాలా ప్రాంతాల్లో కనిపించే పెద్ద పిల్లి. 2014 లెక్కల ప్రకారం.. దేశంలో 7,910 చిరుతపులులు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 12,000 చిరుతపులులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీటిలో ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 1,800 చిరుతలు ఉన్నాయి. ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఇవి చాలా వేగంగా పరిగెత్తగలవు. వేటలో చాలా తెలివిగా వ్యవహరిస్తాయి.

ఆసియాటిక్ సింహం.. ఇది ఇండియాలో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక రకమైన సింహం. ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవిలో ఇవి కనిపిస్తాయి. ఇవి 8 నుంచి 30 సింహాలు కలిసి ఒక గుంపుగా జీవిస్తాయి. సాధారణంగా ఆడ సింహాలు వేట చేస్తాయి, పిల్లలను కాపాడతాయి. మగ సింహం సుమారు 180 కిలోలు, ఆడ సింహం సుమారు 130 కిలోలు బరువు ఉంటాయి. ఇవి అడవిలో తిరుగుతూ తమ శక్తిని చూపిస్తాయి.

స్నో లియోపర్డ్.. ఈ చిరుత జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో కనిపిస్తుంది. ఈ జంతువు కొండలు, రాతి ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడుతుంది. పై నుండి వేటపైన దాడి చేయడంలో మంచు చిరుతలకు మంచి నైపుణ్యం ఉంది. పరిమాణంలో ఇది చిన్నదే అయినా శక్తిలో తక్కువ కాదు. ఇది సుమారు 2 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. బరువు 35 నుంచి 55 కిలోల మధ్య ఉంటుంది. ఇది ఎక్కువగా మంచుతో కప్పబడ్డ అడవుల్లో జీవిస్తుంది.