
త్వరలో సంక్రాంతి పండుగ వస్తండటంతో.. రైతులకు కానుక ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. పండుగలోపే రైతు భరోసా డబ్బులు విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. యాసంగి సీజన్ కోసం పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయనున్నారు. దీంతో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయా? అని రైతులందరూ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే యాసంగి సాగు రాష్ట్రంలో మొదలుకావడంతో పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా? అని రైతులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు సంక్రాంతికి ముందే జమ చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆనందం రెట్టింపయింది. అయితే ఈ సారి రైతు భరోసా మరికొంతమందికి కట్ కానుంది. కేవలం పంట సాగు చేస్తున్న భూములకే మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారు.

పంట సాగవుతున్న భూములను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం సింథటిక్ ఎపర్చర్ రాడార్ శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటోంది. దీని ఆధారంగా శాటిలైట్ సర్వే నిర్వహించి పంట సాగువుతున్న భూములను గుర్తిస్తోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే జరుగుతోంది.

త్వరలోనే ఈ సర్వే పూర్తి కానుండగా.. ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూముల యజమానులకు మాత్రమే రైతు భరోసా అందించనుంది. సాగులో లేని భూములను గుర్తించి అనర్హులుగా తేల్చి తొలగించనున్నారు. త్వరలో సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి అందనుండగా.. అనర్హులను పథకం నుంచి తొలగించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం 65 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. వీరికి నిధులు అందించాలంటే రూ.9 వేల కోట్ల అవసరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వీటిని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సారి ప్రభుత్వం పక్కాగా వెళుతుండటంతో అనర్హుల సంఖ్య పెరిగే అవకాశముంది