- Telugu News Photo Gallery Political photos Expelled aiadmk chief vk sasikala quits politics ahead of tamil nadu polls
Sasikala: శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు, ప్రజా జీవితానికి గుడ్ బై.. డీఎంకేను ఓడించాలని పిలుపు
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవించి ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరులోని
Updated on: Mar 04, 2021 | 3:14 AM

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవించి ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అయితే శశికళ ఉన్నట్టుండి రాజకీయాలు, ప్రజాజీవితానికి గుడ్‌బై చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. తనకు పదవుల మీద, అధికారం మీద ముందు నుంచే పెద్దగా ఆసక్తి లేదని ఆమె అన్నారు.

అమ్మ జయలలిత అభిమానులు అందరూ ఏకమై డీఎంకేను ఓడించాలని శశికల అభిమానులు, మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అయితే శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలు నుంచి విడుదలైన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నమ్మ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే అన్నాడీఎంకేను మళ్లీ ఆమె కైవసం చేసుకుంటారని కూడా జోరుగా ప్రచారం జరిగింది.

అయితే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంతంగా AMMK పార్టీని పెట్టారు. జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అవినీతి కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత శశికళ ఆ పార్టీని ముందుండి నడిపిస్తారని, అన్నాడీఎంకే నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని భావించారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లు శిక్ష పూర్తి చేసుకుని విడుదలై తమిళనాడులో అడుగు పెట్టారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా మరో ఆరేళ్లు నిషేధం ఉండటంతో ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పైగా తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసి తన సీఎం కోరికను అడ్డుతగిలిన పళనీస్వామి, పన్నీర్‌సెల్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా..? అని భావించారు.

అయితే AMMK పార్టీని కూడా అన్నాడీఎంకేలో విలీనం చేసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పన్నీర్ సెల్వం మీద కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిడి చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాలో వారు సమావేశం అయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకే - బీజేపీ కూటమి గెలవాలంటే చిన్నమ్మ పార్టీని కూడా విలీనం చేసుకోవాలని అమిత్ షా ఒత్తిడి చేశారనే టాక్ వినిపించింది.

అయితే, అయితే పుకార్లుగా వ్యాపించిన ఇలాంటి వార్తలను తమిళనాడు మంత్రి జయకుమార్ ఖండించారు. మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేదు. మా పార్టీ అంతర్గత విషయాల్లో బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకోదు. ఇంతకు ముందే సీఎం చెప్పినట్టు ఏఎంఎంకే పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేసే అవకాశం ఎంతమాత్రం లేదు అని స్పష్టం చేశారు. ఇది మా కచ్చితమైన నిర్ణయం. అమిత్ షాతో సమావేశంలో విలీనం గురించి చర్చించినట్టు మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు సుజావుగా జరుగుతుంది. దీనిపై త్వరలో నిర్ణయానికి వస్తాం.. అని జయకుమార్ స్పష్టం చేశారు.




