
హెల్త్ ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న హెల్త్ ఎమర్జెన్సీని నివారించేందుకు, దాన్ని ఎదుర్కొవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన జీ-20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.

నిర్దేశిత 2030 లక్ష్యానికి ముందే క్షయ వ్యాధి నిర్మూలన దిశగా భారత్ ముందడుగులు వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. వైద్య రంగంలో సాంకేతికత లభ్యతను అందిరికి సులభతరం చేసేలా చొరవ చూపాలని జీ20 సభ్యలను కోరారు.

ప్రజాప్రయోజన ఆవిష్కరణలకు అందరూ ముందుకు రావాలన్నారు. అలాగే తదుపరి హెల్త్ ఎమర్జెన్సీని నివారించడానికి, దాన్ని ఎదుర్కొవడానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ స్థాయి చొరవ.. దేశ ప్రజల ప్రయత్నాలకు ఒక ఉమ్మడి వేదికగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే డిజిటల్ ఆవిష్కరణలు, వాటి విధానాలు సైతం ఇందుకు తోడ్పడతాయని చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం ఆవిష్కరణలు ముందుకు రావాలని కోరారు. ఒకే పనికి వేరువేరుగా నిధుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకునేందుకు అందరూ సహకరించాలని అన్నారు.

అలాగే సాంకేతిక లభ్యతను సులభతరం చేయడం వల్ల గ్లోబల్ సౌత్ దేశాల్లో ఆరోగ్య సేవల్లో ఉన్నటువంటి అంతరాయాన్ని పూడ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘నిక్షయ్ మిత్ర’ అనే కార్యక్రమం కింద ఇండియాలో దాదాపు 10 లక్షల మంది క్షయ రోగులను పౌరులు దత్తత తీసుకున్నారని చెప్పారు. 2030 సంవత్సరం నాటికి ప్రపంచ లక్ష్యానికి ముందుగానే భారత్‌లో టీబీ నిర్మూలిస్తామని పేర్కొన్నారు.