
చాలా మందికి తరచూ గోళ్ల రంగు మార్చుకునే అలవాటు ఉంటుంది. రకరకాల నెయిల్ పాలిష్ రంగులను ప్రతిరోజూ ధరించే బట్టల రంగుతో మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటారు. కానీ నెయిల్ పాలిష్‌ని రిమూవర్‌తో మళ్లీ మళ్లీ తొలగించడం చాలా కష్టమైన పని. అలాగే, రిమూవర్‌ను చాలా తరచుగా ఉపయోగిస్తే, అది గోళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

అధిక సార్లు రిమూవర్ వినియోగిస్తే, వాటిల్లోని రసాయన ప్రభావం గోళ్ళపై పడి, పసుపు రంగులోకి మారుతాయి. గోళ్లు మృదువుగా మారి విరిగిపోతాయి. కాబట్టి దీనిని నివారించడం మంచిది.

బదులుగా ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు. ఇది గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు మచ్చలను నివారిస్తుంది. ముందుగా గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని కలపాలి. దానిలో సోప్ లిక్విడ్ కలపాలి. ఇప్పుడు మీ చేతులను ఈ నీటిలో ముంచి మూడు నుంచి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నిమ్మతొక్కను గోళ్లపై సున్నితంగా రుద్వాలి. ఇలా చేస్తే నెయిల్ పాలిష్ సులువుగా ఊడిపోతుంది.

గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఆ నీటిలో గోళ్లను ముంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు నిమ్మతొక్కతో చేతులను బాగా రుద్వాలి. ఇలా చేస్తే నెయిల్ పాలిష్ తేలికగా రాలిపోతుంది.

అలాగే ఉడకబెట్టిన బంగాళదుంప తొక్కను నిమ్మరసం, పంచదార రసంతో కలిపి గోళ్లపై రాయాలి. ఇప్పుడు కాటన్ సహాయంతో రుద్దాలి. ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించకూడదు. ఇలా చేసిన నెయిల్ పాలిష్ పోతుంది. అదేవిధంగా.. నీటిలో నిమ్మరసాన్ని కలిపి దూదితో గోళ్లపై మృదువుగా రుద్దాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.