
ఊపిరితిత్తులను బలోపేతం చేసుకోవడానికి యోగా సనాలను దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఈ యోగాసనాల్లో భుజంగాసనం బెస్ట్.. దీనిని ప్రారంభంలో ప్రతిరోజూ కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే సాధన చేయాలి. అయితే.. కాలక్రమంలో ఈ యోగాసనం చేసే కాల వ్యవధిని పెంచవచ్చు. ఇది ఛాతీ, ఊపిరితిత్తులు, పొట్ట, భుజాల కండరాలను బలపరుస్తుంది. అంతేకాదు వెన్నెముక కూడా ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.

శీతాకాలంలో లేదా మరేదైనా సీజన్‌లో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఉస్ట్రాసనం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగాసనం ఛాతీ కండరాలను సాగదీస్తుంది. ఊపిరితిత్తులను తెరవడంలో సహాయపడుతుంది. ఈ యోగాసనం చేయడం వల్ల వెన్నె, నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదర కండరాలు కూడా బలపడతాయి.

అర్ధమత్యేంద్రాసనాన్ని ఇంగ్లీషులో 'హాఫ్ స్పైనల్ ట్విస్ట్' అంటారు. ఈ యోగాసనం చేయడం వల్ల ఛాతీ తెరుచుకుంటుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. అంతేకాదు ఈ యోగా ఆసనాలు పీరియడ్స్, భుజాలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎగువ వెనుక, మెడ కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి గౌముఖాసనం ఎంతో మేలు చేస్తుంది. ఆస్తమా ఉన్నవారు ఈ యోగాసనం చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఈ యోగా ఆసనం తుంటి , వెన్నునొప్పి, భుజం దృఢత్వం, మెడ , వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. శారీరక భంగిమను మెరుగుపరచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

శ్వాస సంబంధిత సమస్యలను నివారించడానికి, ప్రాణాయామం చేయడం ఉత్తమం, ఎందుకంటే ప్రాణాయామం శ్వాస పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు మళ్లీ మళ్లీ తలెత్తకుండా చూసుకోవడానికి కపాలభాతి, నాడి శోధన ప్రాణాయామం, అనులోమ్-విలోమ్, భ్రమరి వంటి ఒకటి లేదా రెండు ప్రాణాయామంలను ప్రతిరోజూ చేయవచ్చు.