- Telugu News Photo Gallery Lotus flowers bringing income to people in B.b. Gudem village, Gannavaram Mandal, Krishna district
Lotus Flowers: కార్తీకంలో పువ్వులకు డిమాండ్.. గ్రామాలకు ఆదాయం తెచ్చిపెడుతున్న కలువ పువ్వులు
అవి దేవదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన పూలు.. మహాదేవుడికి ఎంతో భక్తితో భక్తులు పూజ చేసేందుకు ఉపయోగించే పూలు. అవి మరేవో కాదు.. కలువపూలు. కార్తీక మాసంలో కలువపూలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే కలువపూలను ఎంతపెట్టి కొనుగోలు చేసేందుకైనా భక్తులు వెనకాడటం లేదంటే అతిశయోక్తి లేదు...
Updated on: Nov 13, 2024 | 4:04 PM

శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కలువ పూలకు కార్తీక మాసంలో భారీగా డిమాండ్ ఉంటుంది. కలువ పూలతో పరమశివుడిని పూజిస్తారు. ఆరాధిస్తారు. పరమశివుడితో పాటు లక్ష్మీదేవిని కూడా కలువపూలతో పూజిస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కలువ పూలకు భారీగా డిమాండ్ ఉండటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

అసలు అరుదుగా లభించే కలువపూలకు కార్తీక మాసంలో ఎక్కువ డిమాండ్ ఉండటంతో వాటిని ఎంత ధర అయినా పెట్టి కొనేందుకు భక్తులు వెనకాడటం లేదు.

కృష్ణాజిల్లా గన్నవరం మండలం బీబీ గూడెం గ్రామంలో కలువపూలు పెరిగే రెండు చెరువులు ఉన్నాయి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు... ఈ రెండు చెరువులు రంగురంగుల కలువపూలతో అందంగా మారిపోతాయి. ఎక్కువగా గులాబీ వర్ణం కలిగిన కలువ పూలు, కొన్ని తెలుపు, మరికొన్ని కెంపు ఇలా విభిన్న రంగుల్లో పూస్తాయి. ఈ పూలతో భారీ మొత్తంగా వ్యాపారం సాగుతుంది.

బీబీ గూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఈ చెరువలపై ఏటా రూ.3లక్షల ఆదాయం వస్తుందంటే అతిశయోక్తి లేదు. ఏటా గ్రామ పంచాయతీ పాట పెట్టినప్పుడు గ్రామస్థులు పాటను దక్కించుకోవటానికి పోటీలు పడతారంటేనే అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది ఈ చెరువుల పూల పాటను పాడి.. స్థానికులే సొంతం చేసుకున్నారు. ప్రతిరోజు తాజా కలువపూలను కోసి.. విజయవాడలోని పూల మార్కెట్‌కు తీసుకెళతారు. అక్కడి నుంచి రకరకాల పూల వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి..తీసుకెళుతుంటారు.

కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేసేవారు తప్పకుండా.. కలువపూలను ఉపయోగిస్తారు. దీంతో కలువపూలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది.
