
దేశంలో నిరుద్యోగ రేటు గత ఏడేళ్లలో భారీగా తగ్గింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గణాంకాల మేరకు గత ఏడేళ్లలో నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 3.2 శాతంకు పడిపోయింది. గత కొన్నేళ్లుగా భారతలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినట్లు ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

తాజా వార్షిక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక మేరకు.. COVID కాలంతో సహా గత 7 సంవత్సరాలలో ఉపాధి అవకాశాలను అంచనా వేసే వర్కర్ పాపులేషన్ రేషియో (WPR) 2017-18లో ఇది 46.8 శాతంగా ఉండగా.. ఇది 2023-24లో 58.2 శాతానికి పెరిగింది.

అదే కాలంలో 15 ఏళ్లకు పైబడిన వయస్సు ఉన్న వ్యక్తుల నిరుద్యోగ రేటు (UR) 6.0 శాతం నుండి 3.2 శాతానికి తగ్గింది. గత కొన్నేళ్లుగా కార్మిక మార్కెట్‌లో మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని నిర్ధారించేలా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గణాంకాలు ఉన్నాయి.

అమెరికా వంటి అగ్ర దేశాల్లో నిరుద్యోగ రేటు ఏటికేడు పెరుగుతుండగా.. భారత్‌లో గత ఏడేళ్ల కాలంలో గణనీయంగా తగ్గడం విశేషం. దీని పట్ల భారత ప్రభుత్వ వర్గాలతో పాటు పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

మోడీ సర్కారు ఉపాధి కల్పన దిశగా తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు నిరుద్యోగ రేటు తగ్గేందుకు దోహదం చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.