ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీవాస్తవ అత్యంత పొడవాటి జుట్టు కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. చిన్నప్పటి నుంచి జుట్టు పోషణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. 14వ యేట నుంచి జుట్టును కత్తిరించుకోవడం మానేసిందట.
ఆమె శిరోజాల పొడవు ఏకంగా 7 అడుగుల 9 అంగుళాలు పొడవుంది. 1980లలో హిందీ సినిమాల్లో పొడవాటి జుట్టు కలిగిన హీరోయిన్లను చూసి ప్రేరణ పొందానని చెప్పుకొచ్చారు. భారతీయ సంస్కృతిలో పొడవాటి జుట్టు ఉన్న మహిళలను దేవతామూర్తులుగా భావిస్తారు. అందుకే మన సమాజంలో ఆడవారు జుట్టు కత్తిరించుకోవడాన్ని అశుభంగా భావిస్తారు. అంతేకాకుండా పొడవాటి కురులు ఆడవారి అందాన్ని మరింత పెంచుతుంది.
ప్రయాగ్‌రాజ్‌లోని అల్లాపూర్‌లో నివసిస్తున్న స్మితా శ్రీవాస్తవ ప్రపంచంలోనే అత్యంత పొడవాటి జుట్టు కలిగి ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం స్మితా శ్రీవాస్తవ కేశ సంపదకు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
స్మితా శ్రీవాస్తవ జుట్టు చిన్నప్పటి నుండి, చాలా మందంగా, పొడవుగా ఉండేదట. ఆమె వ్యాపారవేత్త సుదేష్ శ్రీవాస్తవను వివాహం చేసుకున్నారు. స్మితకు ఇద్దరు కొడుకులు.
స్మిత వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తుందట. వాషింగ్, డ్రైయింగ్, డిటాంగ్లింగ్, స్టైలింగ్‌తో సహా మొత్తం ప్రక్రియకు మూడు గంటల వరకు సమయం పడుతుందని వివరించింది. జుట్టు శుభ్రం చేయడానికి 30-45 నిమిషాలు సమయం పడుతుందని తెలిపింది. ఆపై తొలుత చేతులతో చిక్కును తొలగించి టవల్‌తో ఆరబెడుతుంది. ఇదంతా చేయడానికి రెండు గంటల సమయం పడుతుందని తెల్పింది. గిన్నీస్ బుక్‌లో స్థానం పొందడం ఎంతో సంతోషంగా ఉందని మీడియాకు తెల్పింది.