
వర్షాకాలం, చలి కాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు. వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామం: తేలికపాటి వ్యాయామం, యోగా, స్ట్రెచింగ్ వంటివి కీళ్ల కదలికను మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణను పెంచుతాయి. అయితే వ్యాయామం చేసేటప్పుడు తేమతో కూడిన ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది.కీళ్లను చలి నుంచి రక్షించడం చాలా ముఖ్యం. మోకాళ్లు, నడుము భాగాలను వెచ్చని దుస్తులతో కప్పి ఉంచండి. అలాగే, తడి బట్టలు, బూట్లు, చెప్పులు ఎక్కువసేపు ధరించకుండా ఉండండి.

సరైన ఆహారం: మీ ఆహారంలో పసుపు, అల్లం, తాజా పండ్లు చేర్చుకోండి. ఇవి సహజసిద్ధంగా మంటను తగ్గిస్తాయి. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే అవిసె గింజలు, వాల్‌నట్‌లు, చేపలు తినడం వల్ల వాపు తగ్గుతుంది. ఉప్పు ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం కూడా చాలా ముఖ్యం. వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి, పాలు, పనీర్, ఆకుకూరలు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం అవసరం.

సరైన భంగిమ: ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం కీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. ప్రతి 45 నిమిషాలకు లేచి కాసేపు అటూ ఇటూ తిరగండి. కూర్చున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోవడం కూడా అవసరం. వర్షాకాలంలో తడి ప్రదేశాల్లో జారిపడి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాంటీ-స్లిప్ బూట్లు ధరించడం మరియు తడి నేలలపై జాగ్రత్తగా నడవడం చాలా ముఖ్యం.

బరువు నియంత్రణ: అధిక బరువు కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. కొద్దిగా బరువు తగ్గినా నొప్పి గణనీయంగా తగ్గుతుంది. తగినంత నీరు త్రాగడం వల్ల కీళ్లలోని ద్రవాలు గట్టిపడకుండా ఉంటాయి. ఇది కీళ్ల కదలికను సులభతరం చేస్తుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.