
తల స్నానం చేసుకోవడానికి ఎన్నో రకాల షాంపూలు వాడుతూ ఉంటారు. మార్కెట్‌లో కూడా రకరకాల షాంపూలు లభిస్తూ ఉంటున్నాయి. షాంపూలతో చాలా సులభంగా తక్కువ సమయంలోనే తల స్నానం చేసుకోవచ్చు. పూర్వం అయితే కుంకుడు కాయలతో హెడ్ బాత్ చేసే వారు కానీ.. ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎవరో అక్కడక్కడ మాత్రమే చేస్తున్నారు.

సాధారణ షాంపూలతో కంటే కుంకుడు కాయలు వాడటమే మంచిదని అందరూ అంటారు. కానీ వీటితో తల స్నానం చేస్తే.. ఉపయోగించడం ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు జుట్టుకు సంబంధించి అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కొన్ని రకాల షాంపూల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేక పోలేదు.

హెయిర్‌ని శుభ్రం చేసుకోవడానికి షాంపూలకు బదులు.. కుంకుడు కాయల్ని వాడితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల జట్టు మురికి పూర్తిగా తొలగడమే కాకుండా.. తలలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి నశిస్తాయి. తలలో పేల సమస్య, చుండ్రు కూడా తగ్గుతుంది.

కుంకుడు కాయలు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అయితే కుంకుడు కాయల రసం కళ్లల్లో పడి కళ్లు మండటం, కుంకుడు తొక్కలు జుట్టులో ఇరుక్కోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో చిరాకుగా అనిపించి వీటి వాడకం తగ్గించేశారు. కుంకుడు కాయలతో సులభంగా షాంపూ కూడా తయారు చేసుకోవచ్చు.

కుంకుడు కాయల లోపల ఉండే గింజల్ని పగలగొట్టి.. వాటిని మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి. దీన్ని కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత ఓ డబ్బాలో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. తలస్నానం చేయాల్సినప్పుడల్లా వాటిని ఆ పొడిని నీటిలో కలుపుకుని హెడ్ బాత్ చేయడమే. ఇలా చేస్తే జుట్టుకు కూడా మేలు జరుగుతుంది.