- Telugu News Photo Gallery Here is information about the nutrients that mother and baby need after delivery as post delivery diet
Post Delivery Diet: డెలివరీ తర్వాత తల్లి-బిడ్డలకు అవసరమైన పోషకాలివే.. వాటిని ఎలా పొందాలనే వివరాలు మీ కోసం..
గర్భం దాల్చిన స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. అలాగే డెలివరీ తర్వాత కూడా అవే జాగ్రత్తలను తప్పనిసరిగా అనుసరించాలి.
Updated on: Jan 29, 2023 | 3:32 PM

గర్భం దాల్చిన స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. అలాగే డెలివరీ తర్వాత కూడా అవే జాగ్రత్తలను తప్పనిసరిగా అనుసరించాలి.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన ఆరోగ్య నిపుణురాలు ప్రకృతి పొద్దార్ డెలివరీ అయిన తర్వాత తల్లి-బిడ్డల ఆరోగ్యానికి అవసరమైన కొన్ని పోషకాలను, వాటిని పొందడం ఎలా అనే విషయాలను తెలియజేశారు. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

డెలివరీ అయిన తర్వాత తల్లి-బిడ్డలు వారి పోషక అవసరాలను తీర్చడానికి పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. అవి..

విటమిన్ డి: సూర్యరశ్మి నుంచి శరీరం శోషించే దీనిని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. శరీరం ఆరోగ్యం కోసం, విటమిన్ డీ లోపం ఏర్పడకుండా ఉండడానికి ఈ విటమిన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇది రుతుక్రమం ఆగిన స్త్రీలకు, డెలివరీ అయిన తర్వాత తల్లి-బిడ్డలకు అవసరమైన పోషకాహారం.

విటమిన్ డి కోసం మీరు పుట్టగొడుగులు, తృణధాన్యాలు, పాలు, సాల్మన్ వంటి కొవ్వు చేపలు, గుడ్లను తినవచ్చు. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

కాల్షియం: ఆరోగ్యకరమైన, దృఢమైన ఎముకలు, దంతాలు, రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యం కోసం కాల్షియం అవసరం. పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా నువ్వులు, అరటిపండ్లు, యాపిల్స్ కూడా కాల్షియం ఎక్కువగా లభిస్తుంది.

ఐరన్: చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అందువల్ల శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఐరన్ అవసరం. ఇది ఆకుపచ్చ కూరగాయలు, చిక్కుళ్ళు, బీట్‌రూట్, పుట్టగొడుగులు, సోయాబీన్స్, యాపిల్స్, అరటిపండ్లు, ఖర్జూరాలు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లలో సమృద్ధిగా లభించే ముఖ్యమైన ఖనిజం.

ఫోలిక్ యాసిడ్: ఫోలిక్ యాసిడ్ అనేది బాలింత-బిడ్డల పెరుగుదలలో కీలక పాత్ర పోషించే ముఖ్యమైన పోషకం. ఫోలిక్ యాసిడ్‌ను తగినంత తీసుకోవడం శిశువు మెదడు, వెన్నెముకలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే లోపాలను (పుట్టుకతో వచ్చేవి) నివారించడంలో సహాయపడుతుంది. ఇది నారింజ, ఆకుపచ్చ కూరగాయలు, బీన్స్, బఠానీలలో లభిస్తుంది.

విటమిన్ బి: ఇది పిల్లలలో నరాల, కండరాల అభివృద్ధికి.. ఆరోగ్యకరమైన, సురక్షితమైన గర్భధారణకు సహాయపడుతుంది. విటమిన్ బి గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పుట్టగొడుగులు, గోధుమలు,అవకాడోలలో పుష్కలంగా ఉంటుంది.





























