
Andhra Pradesh Weather Updates: ఉత్తర బంగాళాఖాతం మధ్యప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని కేపుపార తీరానికి 200 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్ దిగా తీరానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇది ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ కేపు దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడుతుందని హెచ్చరించింది.

వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగముతో ఈదురు గాలులు వీచే అవకాశముంది.

వాయుగుండం ప్రభావంతో ఏపీ కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండ్రోజులపాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతున్న నేపథ్యంలో అధికారులు తీర ప్రాంతాలను అలర్ట్ చేశారు. ఇప్పటికే, తీర ప్రాంతాల్లోని ప్రజలకు సూచనలు కూడా చేశారు. తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.