
పిల్లల్లో గుండె రక్తనాళాలపై ఒత్తిడి పెరగడానికి వారి ఆహారపు అలవాట్లే ముఖ్య కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్, వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ తరచుగా తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగి రక్తనాళాలు దెబ్బతింటాయి. పిల్లలు ఎక్కువ సమయం టీవీ, మొబైల్, వీడియో గేమ్స్‌తో గడపడం వల్ల శారీరక వ్యాయామం తగ్గిపోతుంది. దీని ఫలితంగా పిల్లల్లో అధిక బరువు సమస్య వస్తుంది. ఊబకాయం గుండె సమస్యలకు దారితీసే ప్రధాన కారణం.

జన్యు లక్షణాలు కూడా చిన్న వయసులో గుండె సమస్యలు రావడానికి ఒక ముఖ్య కారణం. తల్లిదండ్రులు లేదా దగ్గరి కుటుంబ సభ్యులలో అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా గుండె కండరాల లోపాలు వంటి సమస్యలు ఉంటే ఆ లక్షణాలు పిల్లలకు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జన్యుపరమైన సమస్యలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రత్యేకంగా పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించడం అవసరం.

చిన్న వయసులోనే పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి కూడా హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతోంది. స్కూల్ ప్రెషర్, హోంవర్క్ ఒత్తిడి, పోటీతత్వం, ట్యూషన్ల కోసం ఆట సమయాన్ని తగ్గించడం, ఎక్కువ బరువున్న స్కూల్ బ్యాగ్‌లు మోయడం వంటివి మానసిక ఆందోళనను పెంచుతాయి. ఈ అధిక ఒత్తిడి గుండె క్షీణతకు దారితీసే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు నిరంతరం బాగా చదవాలి అని ఒత్తిడి చేయడం కంటే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ముఖ్యం.

పిల్లల్లో గుండె సమస్యలు రాకుండా నిరోధించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పండ్లు, కూరగాయలు, పప్పులు, తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర ఉన్న ఆహారాలను ఇవ్వండి. వేయించిన, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను పూర్తిగా తగ్గించండి. ప్రతి రోజు కనీసం 30 నుండి 45 నిమిషాలు పాటు పిల్లలు ఆరుబయట ఆడుకోవడానికి, వాకింగ్‌కు లేదా ఇతర ఆటలకు కేటాయించేలా చూడాలి. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల వారు చురుకుగా ఉంటారు.

పిల్లలపై చదువు విషయంలో అనవసరమైన ఒత్తిడి పెట్టకండి. వారికి తగినంత విశ్రాంతి, ఆట సమయాన్ని ఇవ్వండి. మానసిక ఆందోళనలను గుర్తించి, వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించండి. కుటుంబంలో గుండె సమస్యలు ఉంటే, క్రమం తప్పకుండా పిల్లల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయించాలి.