
డైట్ సోడా తాగడం వల్ల స్ట్రోక్ రిస్క్ మూడు రెట్లు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. డైట్ సోడాలో కేలరీలు లేదా చక్కెర ఉండదనే ప్రచారం అవాస్తవం అంటున్నారు. వాస్తవానికి ఇదొక కార్బొనేటేడ్ సిరప్ అంటున్నారు. కృత్రిమంగా, మిస్టరీ ఇన్ గ్రీడెంట్స్ తో తయారు చేసిందని నిపుణులు అంటున్నారు.

క్యాలరీల వినియోగాన్ని నియంత్రించే శరీర సహజ సామర్ధ్యాన్ని కృత్రిమ స్వీటెనర్లు దెబ్బతీస్తాయి. ప్రేవుల్లో బ్యాక్టీరియను మార్చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఏమార్చేస్తాయి. డైట్ సోడాలో ఉండే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లతో ఆకలి పెరిగి తీపి పదార్ధాలను అధికంగా తీసుకునేలా ప్రేరేపిస్తాయి. దీంతో శరీర బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

డైట్ సోడాలకు ప్రత్యామ్నాయంగా మంచినీరు, హెర్బల్ టీలు, సహజమైన ఫ్లేవర్డ్ వాటర్ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డైట్ సోడాలతో టైప్ 2 డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

రోజుకు ఒక్క డైట్ డ్రింక్ తాగడం వల్ల ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు డిమెన్షియా ముప్పు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

డైట్ సోడాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఊబకాయం, మధుమేహ ముప్పు, హృద్రోగ ముప్పు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. కిడ్నీ దెబ్బతినే అవకాశం కూడా పొంచివుందని చెప్పారు. ఎముకల బలహీనం, దంత సమస్యలు, జీర్ణ సమస్యలు కూడా వెంటాడే ప్రమాదం ఉంది.