
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమాశారు. గత ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1943 అక్టోబర్ 31 న జన్మించిన ఊమెన్ చాందీ.. రెండుసార్లు కేరళ సీఎంగా పనిచేశారు. ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఊమెన్ చాందీ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి తిరువనంతపురానికి ప్రజల సందర్శనార్థం తరలించారు. అక్కడి నుంచి కొట్టాయంకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఊమెన్ చాందీ మరణ వార్త తెలియగానే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే సహా పలువురు నేతలు ఆయనకు సంతాపం తెలిపారు. విపక్షాల భేటీ నేపథ్యంలో బెంగళూరులో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది.

కేరళ ప్రభుత్వం సైతం ఊమెన్ చాందీ గౌరవార్థం రెండు రోజులు సంతాప దినంగా ప్రకటించింది. అలాగే ఈరోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఊమెన్ చాందీ స్వస్థలం కొట్టాయం జిల్లా పుతుప్పల్లి. భార్య పేరు మరియమ్మా. వీళ్లకు ముగ్గురు సంతానం. విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ యూత్ వింగ్ అయిన కేరళ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.

1970లో పుతుప్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2004-2006, 2011-2016 మధ్య రెండు సార్లు కేరళకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కేరళ అసెంబ్లీకి సుదీర్ఘకాలం పనిచేసిన ఎమ్మెల్యేగా ఊమెన్ చాందీ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి కూడా ప్రజలకు సేవ చేసినందుకు అవార్టు పొందిన వ్యక్తి కూడా ఊమెన్ చాందీ కావడం గమనార్హం.

2013లో కేరళ సోలార్ ప్యానెల్ స్కామ్, విళింజమ్ పోర్ట్ అవినీతి ఆరోపణలు, పట్టూర్ భూముల కేసు, పల్మోలెయిన్ ఆయిల్ ఇంపోర్ట్ స్కామ్‌లు ఊమెచ్ చాందీ హయాంలో కుదిపేశాయి. 2018 జూన్ 6వ తేదీన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ ఇన్‌ఛార్జీగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను ఊమెన్ చాందీకి అప్పగించారు. అలాగే చివరి రోజుల్లో ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయల్లో ఉన్న ఆయన ఏనాడు కూడా పార్టీ మారలేదు.