ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి భయాలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించేలోపే మరో కొత్త వైరస్ భయపెడుతోంది. హెచ్3ఎన్2 వైరస్ పంజా విసురుతోంది.
రోజురోజుకీ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు మరణించడంతో ప్రభుత్వాలు సైతం అలర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుదుచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అక్కడ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుడడంతో పది రోజులపాటు పాఠశాలకు సెలవులు ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మార్చి 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫ్లూయెంజా ఏ వైరస్ వల్ల పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం ప్రాంతాల్లో అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యా శాఖ మంత్రి ఏ నమశ్శివాయం ఉత్తర్వులు జారీ చేశారు.