
పచ్చి మిరపకాయలు కేవలం వంటకు రుచి, ఘాటు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ C, A, B5 వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా క్యాప్సైసిన్ అనే పదార్థం జీవక్రియను వేగవంతం చేసి జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పచ్చిమిర్చిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. తక్కువ కేలరీలు ఉండడం వల్ల బరువు నియంత్రణకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎండుకారానికి బదులుగా పచ్చిమిరపకాయలు వాడితే మంచిదని, ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ C పచ్చి మిరపకాయల్లో సమృద్ధిగా ఉండి ముడతలు, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుతుంది. ఫైటోన్యూట్రియెంట్స్ చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

అలాగే విటమిన్ E సహజమైన నూనెలను అందిస్తూ తేమను కాపాడుతుంది. విటమిన్ A ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంది. కాబట్టి రోజుకు రెండు మూడు పచ్చి మిరపకాయలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పచ్చిమిరపకాయలలో బీటా కెరోటిన్, లుటిన్ జియాక్సంథిన్, క్రిప్టోక్సాంటిన్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పచ్చిమిరపకాయలను ఆహారంలో భాగంగా చేసుకుని తింటే మంచిదని చెప్తున్నారు. అయితే చాలా ఎక్కువగా పచ్చిమిరపకాయలను తినడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని చెప్తున్నారు.

పచ్చిమిరపకాయలతో క్యాన్సర్ సమస్యను సైతం దూరం చేయొచ్చు అంటున్నారు నిపుణులు. పచ్చిమిరపకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి క్యాన్సర్ ప్రమాదం నుంచి కాపాడతాయని చెబుతున్నారు. అంతేకాదు పచ్చిమిరపకాయలు జీర్ణ వ్యవస్థను సజావుగా నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.