
ఢిల్లీలోని GTB హాస్పిటల్ మాజీ డైటీషియన్ డాక్టర్ అనామిక గౌర్ ప్రకారం.. పల్లీలు తినడం వల్ల బరువు పెరుగుతారనేది ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి ఇందులో ఉండే అధిక ప్రోటీన్, శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పల్లీలోని కేలరీల్లో 25శాతం ప్రోటీన్ నుండే వస్తుంది. ఇది తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపించి, త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. ఫలితంగా మనం అతిగా తినడం తగ్గుతుంది. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది.

పల్లీలు సహజంగా ఆరోగ్యకరమే అయినా వాటిని తీసుకునే విధానంపై బరువు పెరగడం ఆధారపడి ఉంటుంది. మీరు నెయ్యి లేదా నూనెలో వేయించిన పల్లీలను తీసుకుంటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఉడకబెట్టిన లేదా డ్రై రోస్ట్ చేసిన వేరుశనగలు ఆరోగ్యానికి శ్రేయస్కరం.

పల్లీలను బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన శక్తి అందుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పల్లీలోని ప్రోటీన్లు కలిసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ఎంత ఆరోగ్యకరమైనా సరే.. రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ పల్లీలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

అందరికీ పల్లీలు పడవు. పల్లీలు అలెర్జీ ఉన్నవారు వీటిని ముట్టుకోకపోవడమే మంచిది. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహాతోనే తీసుకోవాలి. తీవ్రమైన మలబద్ధకం ఉన్నవారికి ఇవి ఇబ్బంది కలిగించవచ్చు. చాలా తక్కువ బరువు ఉన్నవారు నిపుణుల సూచన మేరకు మాత్రమే డైట్‌లో చేర్చుకోవాలి.