
కావలసిన పదార్థాలు: 2 కప్పుల రోల్డ్ ఓట్స్, ¾ కప్పు మినప్పప్పు , ¼ కప్పు పచ్చిశనగపప్పు, 1 టీస్పూన్ మెంతులు, నానబెట్టడానికి మరియు రుబ్బడానికి తగినన్ని నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, దోశలు కాల్చడానికి కొద్దిగా నూనె లేదా నెయ్యి, గుమ్మడి గింజల కారప్పొడి లేదా ఇడ్లీ కారం ఇది ఆప్షనల్.

తయారీ విధానం: ఒక వెడల్పాటి బౌల్‌లో రెండు కప్పుల రోల్డ్ ఓట్స్, ముప్పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక టీస్పూన్ మెంతులు వేయాలి. వీటిని శుభ్రంగా రెండు నుండి మూడు సార్లు నీటితో కడగాలి. ఆ తర్వాత ఓట్స్ బాగా నీటిని పీల్చుకుంటాయి కాబట్టి కాస్త ఎక్కువగానే మంచి నీళ్లు పోసి మూతపెట్టి 5 నుండి 6 గంటల పాటు నాననివ్వాలి.

నానిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఓట్స్‌లో ఇప్పటికే తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోయకూడదు; కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి నీళ్లు ఎక్కువైతే పిండి పల్చబడి దోశలు రావు. ఈ పిండిని బౌల్‌లోకి తీసుకుని రాత్రంతా లేదా 7-8 గంటలు పక్కన ఉంచితే పిండి చక్కగా పొంగుతుంది . ఉదయాన్నే సరిపడా ఉప్పు, కాస్త నీళ్లు కలిపి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి.

స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి మీడియం హీట్ చేయాలి. పెనాన్ని తడి గుడ్డ లేదా టిష్యూతో తుడవాలి. గరిటెడు పిండిని పెనం మధ్యలో వేసి గుండ్రంగా పలుచగా స్ప్రెడ్ చేయాలి. పైనుంచి కొద్దిగా నూనె లేదా నెయ్యి చిలకరించాలి. ఒకవైపు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా మారిన తర్వాత రెండో వైపుకు తిప్పి నిమిషం పాటు కాల్చి తీసుకోవాలి.

మరో దోశ వేసేముందు పెనంపై నీళ్లు చల్లి తుడిచి వేస్తే దోశ సులభంగా పలుచగా వస్తుంది. ఈ పిండితో ప్లెయిన్ దోశలతో పాటు కారప్పొడి దోశ, ఉల్లి కారం దోశ లేదా ఎగ్ దోశ కూడా చేసుకోవచ్చు. పల్లీ చట్నీ లేదా గుమ్మడి గింజల కారప్పొడితో వేడివేడిగా తింటే కరకరలాడుతూ అద్భుతమైన రుచినిస్తుంది