- Telugu News Photo Gallery Cricket photos WTC Final 2023: Virat Kohli and Rohit Sharma will surpass MS Dhoni's unique record for Team India
WTC Final 2023: ధోనీ రికార్డుపై కోహ్లీ-రోహిత్ కన్ను..! టెస్ట్ ఫైనల్ ఆడితే ఆ లిస్టులో రెండో స్థానంలోకి..
WTC Final 2023: WTC ఫైనల్ 2023: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించనున్నారు. తద్వారా టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించనుండడం విశేషం.
Updated on: Jun 04, 2023 | 11:18 AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి లండన్ ఓవల్ మైదానంలో WTC ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరూ ఈ ఐసీసీ టెస్ట్ ఫైనల్స్‌లో ఆడడం ద్వారా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అధిగమించనున్నారు. అదేలా అంటే..

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భారత్ తరఫున అత్యధిక ఐసీసీ ట్రోఫీ ఫైనల్స్ ఆడిన రెండో ఆటగాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు డబ్ల్యూటీసీ ఫైనల్లో ధోనీపై పేరిట ఉన్న ఆ ఘనతను అధిగమించబోతున్నారు.

టీమిండియా తరఫున 3 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ధోనీ 2007లో తొలిసారి ఐసీసీ ఫైనల్ ఆడాడు. అలాగూ 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 T20 ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్.. ఇలా మొత్తం 5 ఐసీసీ ఫైనల్స్ ఆడాడు.

ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న రోహిత్, కోహ్లీ.. తమ కెరీర్‌లో 6వ ఐసీసీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. తద్వారా ధోనిని అధిగమించి రెండో స్థానాన్ని తమ సొంతం చేసుకోబోతున్నారు కోహ్లీ, రోహిత్. ఇక టీమ్ ఇండియా తరఫున ఎక్కువ ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా యువరాజ్ మొదటి స్థానంలో ఉన్నాడు.

కోహ్లి(U-19 ప్రపంచ కప్ ఫైనల్ కాకుండా) 2011లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 ప్రపంచకప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు.

అలాగే 2007 T20 ప్రపంచకప్‌లో రోహిత్ తన మొదటి ICC ఫైనల్‌ను ఆడాడు. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 ప్రపంచకప్, 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా తరఫున ఆడాడు.

కాగా, టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్.. భారత్ తరఫున అత్యధిక ఐసీసీ టోర్నీలు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2000లో తొలి ఐసీసీ ఫైనల్ ఆడిన యువరాజ్ 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్, 2011 ప్రపంచకప్, 2014 టీ20 ప్రపంచకప్, 2017 చాంపియన్స్ ట్రోపీ సహా మొత్తం 7 ఐసీసీ ఫైనల్స్ ఆడి ఈ ఘనతను సాధించాడు.

ఇక నలుగురు కాకుండా సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా తలో 4 ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ ఆడారు.





























