Venkata Chari |
Jul 24, 2024 | 8:42 AM
టీమిండియాకు 2 ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ ఇప్పుడు ఐపీఎల్‌లో పునరాగమనం చేయబోతున్నాడు. మీడియా కథనాల ప్రకారం, యువరాజ్ సింగ్ గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నివేదికల ప్రకారం, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ విక్రమ్ సోలంకి 2025 IPL మెగా వేలానికి ముందు జట్టు నుంచి వైదొలగవచ్చు అని తెలుస్తోంది. అందుకే, ఖాళీని భర్తీ చేసేందుకు గుజరాత్ టైటాన్స్ మేనేజ్‌మెంట్ యువరాజ్ సింగ్‌ను సంప్రదించినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం యువరాజ్ సింగ్ ప్రపంచ వ్యాప్తంగా రిటైర్డ్ ప్లేయర్స్ లీగ్‌లలో పాల్గొంటున్నాడు. అయితే, ఇప్పుడు కోచ్ పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు యువరాజ్ సింగ్‌కు ఐపీఎల్‌లో సుదీర్ఘ అనుభవం కూడా ఉంది.
ఐపీఎల్‌లో యువరాజ్ 132 మ్యాచ్‌లు ఆడి 2750 పరుగులు చేశాడు. వీటిలో 13 అర్ధసెంచరీలు ఉన్నాయి. యువరాజ్ పంజాబ్, హైదరాబాద్, పుణె వారియర్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు.
ఒకవేళ యువరాజ్ సింగ్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన కోచ్ అయితే భారీ మొత్తంలో పారితోషికం అందుకునే అవకాశాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత కోచ్ ఆశిష్ నెహ్రాకు ఒక్కో సీజన్‌కు రూ.3.5 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు యువరాజ్ ఈ స్థానానికి వస్తే అతని జీతం పెరగడం ఖాయం.
యువరాజ్ సింగ్‌తో పాటు, ఇటీవలే భారత జట్టు ప్రధాన కోచ్‌గా వైదొలిగిన రాహుల్ ద్రవిడ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా మారవచ్చు.
ప్రస్తుతం శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతని స్థానంలో ద్రవిడ్‌ని ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అలాగే, ద్రవిడ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.