
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తదుపరి ప్రయాణం ఎటువైపు? ఈ ప్రశ్నకు ప్రస్తుత సమాధానం ఐపీఎల్ మెంటార్ అని తెలుస్తోంది. అంటే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ద్రవిడ్‌ను మెంటార్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ భారత ప్రధాన కోచ్ కావడం దాదాపు ఖాయం. దీని తరువాత, షారుక్ ఖాన్ యాజమాన్యంలోని KKR ఫ్రాంచైజీ మెంటార్ పదవి కోసం టీమిండియా మాజీ కోచ్ ద్రవిడ్‌ను సంప్రదించినట్లు తెలిసింది.

అంతకుముందు రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌కు మెంటార్‌గా పనిచేశాడు. కాబట్టి ఈ పోస్ట్ అతనికి కొత్త కాదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజయ శిఖరాలకు చేర్చిన ద్రావిడ్‌ను మెంటార్‌గా నియమించేందుకు KKR చాలా ఆసక్తిగా ఉందంట.

అయితే రాహుల్ ద్రవిడ్ నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదు. KKR ఫ్రాంచైజీ ఆఫర్‌ను అంగీకరిస్తే, IPL 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ది గ్రేట్ వాల్ మెంటార్‌గా కనిపించే అవకాశం ఉంది.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 89 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్.. 11 అర్ధ సెంచరీలతో మొత్తం 2174 పరుగులు చేశాడు. అతను 2014, 2015లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెంటార్‌గా కూడా పనిచేశాడు. అందుకే రాహుల్ ద్రవిడ్ కేకేఆర్ జట్టుకు కొత్త మెంటార్‌గా కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.