
శనివారం (మే 18) బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన RCB-CSK జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన, కీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు క్రీడాకారిణి జెమియా రోడ్రిగ్స్ కూడా స్టేడియంలో సందడి చేశారు.

ముఖ్యంగా శ్రేయాంక పాటిల్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ తదితర ఆర్సీబీ ఆటగాళ్లతో సెల్ఫీలు దిగింది.

మ్యాచ్ ఆద్యంతం ఆర్సీబీని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఈ మహిళా క్రికెటర్లు.. మ్యాచ్ అనంతరం బెంగళూరు ప్లేయర్లతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

అదేవిధంగా విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి శ్రేయాంక పాటిల్ పోజులివ్వగా, ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఛాంపియన్‌గా మార్చడంలో శ్రేయాంక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు RCB పురుషుల జట్టు కూడా గెలవాలని ఆమె ఉవ్విళ్లూరుతోంది.

కాగా సీఎస్కేను ఓడించి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది ఆర్సీబీ. మే 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో RCB తలపడనుంది.