Ravi Kiran |
Oct 26, 2021 | 4:57 PM
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022లో అన్ని జట్ల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే మరో రెండు జట్ల బిడ్డింగ్ పూర్తి కాగా.. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ టోర్నీలో 10 జట్లు పాల్గొననున్నాయి.
రెండు కొత్త జట్ల రాకతో మొత్తం టోర్నీ మారిపోనుంది. ప్రతీ జట్టు లీగ్ స్టేజిలో 14 మ్యాచ్‌లు ఆడనుండగా.. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు.
ఒక్కో గ్రూప్‌లో 5 జట్లు తలబడతాయి. వీటికి హోంలో నాలుగు మ్యాచ్‌లు, అవేలో నాలుగు మ్యాచ్‌లు.. ఆ తర్వాత మరో గ్రూప్‌లోని 4 జట్లతో ఒక్కో మ్యాచ్.. ఒక్క జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడతాయి.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో చివరి స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ టీంలో చాలా మార్పులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దాదాపు మొత్తం టీం అంతా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వరుస ఓటములు చవి చూడటంతో ఈ ఏడాది మధ్యలోనే డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. కేన్ విలియమ్సన్ కెప్టెన్ అయినా కూడా పెద్దగా మార్పు కనిపించలేదు.
వాస్తవానికి మెగా ఆక్షన్‌కు ముందు ప్రతీ టీం నలుగురు ప్లేయర్స్‌ను అట్టే పెట్టుకోవచ్చు. అందులో ముగ్గురు భారతీయ ఆటగాళ్లు.. ఇద్దరు విదేశీ ప్లేయర్స్ ఉండొచ్చునని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఆ మేరకు చూసుకుంటే.. విలియమ్సన్, రషీద్ ఖాన్‌లు విదేశీ కోటాలో ముందు వరుసలో ఉండగా.. భారత ఆటగాళ్లలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్ మాత్రమే ఉన్నారు.
మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహా.. ఇతర భారతీయ ఆటగాళ్లు ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వలేదు. వీరిలో ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేస్తుందన్నది చూడాల్సిందే.
అటు డేవిడ్ వార్నర్ అయితే ఖచ్చితంగా మెగా ఆక్షన్‌లో వస్తాడు. అర్ధాంతరంగా జట్టు నుంచి తప్పించిన వార్నర్‌పై మిగతా ఫ్రాంచైజీలు కన్నేశాయి. కొత్తగా రెండు జట్లు కూడా రావడంతో అతడు భారీ ధర పలికే అవకాశం ఉంది.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. విలియమ్సన్ కూడా ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. కాబట్టి.. సన్‌రైజర్స్ మేటి ఆటగాళ్ల వరుసలో కేవలంలో రషీద్ ఖాన్, హోల్డర్, నటరాజన్, సందీప్ శర్మ మాత్రమే ఉంటారు.
ఏది ఏమైనా.. హైదరాబాద్ జట్టు: రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండేలను రిటైన్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు..