- Telugu News Photo Gallery Cricket photos IND vs SA ODI: Indian ODI team contender Prithvi shaw venkatesh iyer devdutt padikkal ruturaj gaikwad
సీనియర్లకు చెక్ పెట్టనున్న ‘ఆ నలుగురు’.. టీమిండియాలో స్థిరమైన చోటు కోసం విధ్వంసాలు సృష్టిస్తోన్న యంగ్ ప్లేయర్స్..!
Indian Cricket Team: భారతదేశంలో ప్రతిభకు కొదవ లేదు. ప్రస్తుతం అది వరదలా మారింది. ప్రతీ ఒక్కరూ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Updated on: Dec 13, 2021 | 6:29 AM

Indian Cricket Team: భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ రూపంలో కొత్త వన్డే కెప్టెన్ లభించాడు. గత కొంత కాలంగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్ ఇండియా విజయం సాధించలేకపోయింది. వన్డే ప్రపంచకప్ గురించి మాట్లాడితే, భారత్ చివరిసారిగా 2011లో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. మరలా ప్రపంచకప్ 2023లో ఆడాల్సి ఉంది. యాదృచ్ఛికంగా, ఇది భారతదేశంలోనే జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో భారత్‌లో చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లున్నారు. వీరిలో కొందరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో రన్ మెషీన్‌లుగా మారారు. ప్రస్తుత ఆటగాళ్లకు పోటీ ఇచ్చేలా ఈ యంగ్ ప్లేయర్లు తమ సత్తా చాటుతూ ఘనమైన ఎంట్రీ ఇవ్వాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిని కొంతమందిని చూద్దాం..

దేవదత్ పడిక్కల్- ఈ ఎడమచేతి వాటం కర్నాటక బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఆరితేరాడు. దేవదత్ పడిక్కల్ ఇప్పటివరకు 20 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. 86.68 సగటుతో 1387 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 86.85గా నిలిచింది. 21 ఏళ్ల దేవదత్ పడిక్కల్ లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు కలిగి ఉన్నాడు. 152 పరుగులు అతని అత్యధిక స్కోరుగా నిలిచింది. అతను గత రెండు విజయ్ హజారే ట్రోఫీలలో అత్యధిక పరుగులు చేసినవారిలో ఒకడిగా నిలిచాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున అద్భుత ప్రదర్శన కూడా చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు చేయడంతో ఇటీవలే భారత్ ఏతో దక్షిణాఫ్రికా పర్యటనకు సెలక్టయ్యాడు.

పృథ్వీ షా - ఈ ముంబై బ్యాట్స్‌మన్ చాలా కాలంగా భారత క్రికెట్ భవిష్యత్తుగా పేరు తెచ్చుకున్నాడు. అతని కెప్టెన్సీలో భారత్ 2018లో అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. అయితే అంతకు ముందు స్కూల్ డేస్ నుంచే తన బ్యాటింగ్‌తో ఎన్నో విధ్వంసాలు చేశాడు. ఇప్పుడు కూడా సీనియర్ స్థాయిలో ఆడుతున్నా.. ధాటిగా పరుగులు రాబట్టడంలో మాత్రం ఎలాంటి తడబాటు లేదు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇప్పటి వరకు 44 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 56.48 సగటుతో 2316 పరుగులు చేశాడు.50 ఓవర్ల క్రికెట్‌లో, పృథ్వీ షా 124.98 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. దీనర్థం షా స్కోర్‌లు సూపర్‌ఫాస్ట్ రైలు వేగంతో పరుగులు తీస్తున్నాయనడంలో సందేహం లేదు. అతను తన లిస్ట్ ఏ కెరీర్‌లో 44 మ్యాచ్‌లలో ఎనిమిది సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 227 నాటౌట్. ఈ రికార్డు భారత జట్టులో అతని స్థానాన్ని బలంగా సమర్థిస్తుంది.

వెంకటేష్ అయ్యర్- మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ క్రికెటర్ గత 9-10 నెలల్లో క్రికెట్ బోర్డులో తన పేరును గట్టిగా లిఖించుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ ఫిబ్రవరి-మార్చి 2021లో 198 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో తన బ్యాటింగ్ ద్వారా కేకేఆర్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లే పనిలో కీలకంగా మారాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ ఓపెనర్‌గా అద్భుతంగా ఆడతున్నాడు. కానీ, ప్రస్తుతం మిడిల్, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. దీని ద్వారా, అతను ఫినిషర్ పాత్ర కోసం తన వాదనను మరింత బలంగా చూపిస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ ఇప్పటివరకు 28 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. 54.40 సగటుతో 1197 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 107.74గా ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వెంకటేష్ అయ్యర్ మెరుగ్గా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లో అతని పేరు మీద 18 వికెట్లు ఉన్నాయి.

రితురాజ్ గైక్వాడ్- ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నప్పుడు. రితురాజ్ గైక్వాడ్ ప్రతిభను ప్రపంచం మొదటిసారి చూసింది. అయితే అంతకుముందే దేశవాళీ క్రికెట్‌లో తన విశ్వరూపం చూపించాడు. భారత్ ఏ తరపున నిరంతరం ఆడుతూ పరుగులు తీశాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2020లో, అతను వరుసగా మూడు అర్ధశతకాలు సాధించి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2021లో, రితురాజ్ గైక్వాడ్ తన ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. అయితే ఈ ఆటగాడు టీ20కి మాస్టర్ మాత్రమే కాదు. 50 ఓవర్ల క్రికెట్‌లో కూడా అతని పేరు వినిపిస్తుంది. అతని పేరు మీద ఇప్పటివరకు 63 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో రితురాజ్ 52.81 సగటుతో 3116 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేట్ 98.95గా నిలిచింది. అతని పేరు మీద 10 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.





























