
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఆర్సీబీ పురుషుల, మహిళల జట్లను ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం పూర్తిగా కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు 1.78 బిలియన్ డాలర్లు (రూ. 16,000 కోట్లకు పైగా). ఈ కూటమిలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భారీ మార్పుతో ఆర్సీబీ సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఈ 28 ఏళ్ల ఆర్యమన్ బిర్లా. అయితే ఇతనికి కేవలం వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా క్రికెటర్‌గా కూడా మంచి గుర్తింపు ఉంది. మధ్యప్రదేశ్ తరపున దేశీవాళీ క్రికెట్ ఆడిన ఆర్యమన్, ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, వెంకటేష్ అయ్యర్‌లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యమన్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బెంగాల్‌పై ఒక సెంచరీతో సహా 414 పరుగులు సాధించారు.

ఆర్యమన్ బిర్లాకు ఐపీఎల్ కొత్తేమీ కాదు. 2018 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇతడిని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే, దురదృష్టవశాత్తూ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. దీంతో ఐపీఎల్ నుంచే కాదు, దేశవాళీ నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ సమయంలోనే తీవ్రమైన ఆందోళన (యాంగ్జైటీ) కారణంగా క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ క్రీడలకు స్వస్తి పలికి, ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్‌లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

ఆర్సీబీ బాధ్యతలు చేపట్టడంపై ఆర్యమన్ హర్షం వ్యక్తం చేశారు. "ఆర్సీబీ వృద్ధిలో భాగస్వామి కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. క్రీడలు, మీడియా, వినియోగదారుల వ్యాపారాలపై మాకున్న అవగాహన ఈ జట్టును మరిన్ని శిఖరాలకు చేరుస్తుందని నమ్ముతున్నాను" అని ఆయన పేర్కొన్నారు. మైదానంలో ఆటగాడిగా రాణించలేకపోయినా, ఇప్పుడు యజమానిగా తన జట్టుకు తొలి టైటిల్ అందిస్తారేమో చూడాలి.