
పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. దీనిని సంపూర్ణ ఆహారంగా చెప్తారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. చాలామందికి ఏ పాలు తాగాలి అనే సందేహం ఉంటుంది. ఆవు పాలు, గేదె పాలు రెండూ మంచివే అయినా వాటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.

ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా ముఖ్యం. బర్రె పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. 100 మిల్లీలీటర్ల ఆవు పాలలో 120 మి.గ్రా కాల్షియం ఉంటే, అదే బర్రె పాలలో 180 మి.గ్రా కాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల బలహీనత ఉన్నవారికి లేదా గర్భిణీ స్త్రీలకు బర్రె పాలు మంచివి.

శరీరం కాల్షియంను గ్రహించడానికి విటమిన్ డి అవసరం. ఈ విషయంలో ఆవు పాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. దీనివల్ల విటమిన్ డి కూడా బాగా ఒంటబడుతుంది. బర్రె పాలలో కొవ్వు ఎక్కువ కాబట్టి జీర్ణం కావడం కొంచెం కష్టం.

ఏ పాలు తాగాలి : ఏ పాలు తాగాలి అనేది మీ అవసరాలను బట్టి ఉంటుంది. ఎక్కువ శక్తి కోసం బర్రె పాలు తాగవచ్చు. అవి చిక్కగా ఉండి, ఎక్కువ పోషకాలను శక్తిని ఇస్తాయి. సులభంగా జీర్ణం కావాలంటే ఆవు పాలు మంచివి.

ఆవు పాలు సులభంగా జీర్ణం అవుతాయి కాబట్టి చిన్న పిల్లలకు, వృద్ధులకు, శారీరక శ్రమ చేయనివారికి మంచివి. అయితే బర్రె పాలు చిక్కగా ఉండి, ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి. మీ వయస్సు, జీర్ణశక్తి, శారీరక శ్రమను బట్టి ఏ పాలు మంచివో నిర్ణయించుకోవచ్చు