దేవుడి మీద సినిమా తీసినపుడు ఆయన కంటే పెద్ద అండ ఇంకేం ఉంటుంది చెప్పండి..? అందుకే హనుమాన్ టీం కూడా ఇదే నమ్ముతున్నారు. థియేటర్లు రానీ రాకపోనీ.. ఇవ్వనీ ఇవ్వకపోనీ.. అనుకున్న తేదీకి మేం రావడం పక్కా.. హిట్ కొట్టడం పక్కా అంటున్నారు.
పైగా తాజాగా అమ్మోరు, ఆదిపురుష్ టైమ్ నుంచి ఫాలో అవుతున్న సెంటిమెంట్‌ను వీళ్లు ఫాలో అవుతున్నారు. మరి అదేంటి..? సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో హీరో పరంగా చూసుకుంటే హనుమాన్ చిన్నగా కనిపిస్తుందేమో కానీ ఇది కూడా చాలా పెద్ద సినిమా.
మీడియం రేంజ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని బడ్జెట్‌తో హనుమాన్ రూపొందింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉంటే ప్రతీ టికెట్‌పై 5 రూపాయలు అయోధ్యకు ఇస్తామని చెప్పడంతో హనుమాన్ మరోసారి వార్తల్లో నిలిచింది.
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వేళ ‘హనుమాన్’ సినిమాకు తెగే ప్రతి టికెట్‌పై 5 రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.
ఇందులో భక్తి ఉన్నా.. ఇది కూడా ఓ రకంగా బిజినెస్‌కు బాగానే హెల్ప్ అవుతుంది. ఆ మధ్య ఆదిపురుష్ విడుదల సమయంలో.. ఓ సీట్‌ను హనుమాన్ కోసం ఉంచాలని నిర్ణయించుకున్నారు మేకర్స్.
ఆదిపురుష్ హనుమాన్ సీట్ బానే వైరల్ అయింది. థియేటర్లలో ఫోటో పెట్టి పూజాలు కూడా చేసారు. అప్పట్లో అమ్మోరు సినిమా ఆడుతున్న థియేటర్స్ బయట హుండీ పెట్టారు. అమ్మోరు విగ్రహాన్ని ఉంచారు.
ఇలా ఏదైనా దేవుడి సినిమా చేసినపుడు ప్రమోషన్ కరెక్టుగా జనాల్లోకి తీసుకెళ్లాలి. మరిప్పుడు హనుమాన్ టీం తీసుకున్న 5 రూపాయల విరాళం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.