ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఛాంబర్‌లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ ఎక్కువగా చర్చకు వచ్చిన సినిమా ఈగల్. ఈ ఒక్క సినిమా కోసం చాలా మంది నిర్మాతలు చాలా సార్లు మాట్లాడుకోవాల్సి వచ్చింది.. చివరికి చెప్పినట్లుగానే సోలో డేట్‌కే వచ్చేస్తుంది ఈగల్. మరి రవితేజ కోరుకుంటున్న బ్రేక్‌ను ఈ సినిమా ఇస్తుందా..? అసలు ఈగల్ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి..?
సంక్రాంతికి రావాల్సిన ఈగల్ కాస్తా నెల రోజులు ఆలస్యంగా ఫిబ్రవరి 9న వచ్చేస్తుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. 20214లో వచ్చిన సూర్య వర్సెస్ సూర్య తర్వాత ఈయన డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అనుపమ పరమేశ్వరన్, కావ్య తపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచేసింది.
ఈగల్ రిలీజ్ డేట్ కోసం నిర్మాతల మండలి చిన్న సైజ్ యుద్ధమే చేసింది. ఈ మధ్య కాలంలో ఓ సినిమా కోసం ఇంతగా ఇన్షియేట్ తీసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. సంక్రాంతిని త్యాగం చేసాము కాబట్టి తమకు ఆ గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు ఈగల్ నిర్మాతలు. ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో వరస ఫ్లాపులు ఇచ్చారు రవితేజ. దాంతో ఈగల్ ఈయనకు కీలకం.
ఫిబ్రవరిలో వస్తున్న సినిమాల్లో బిగ్ బడ్జెట్ మూవీ ఈగల్. ఈగల్ కోసం ఫిల్మ్ ఛాంబర్ కష్టపడి సోలో డేట్ ఇప్పించారు. దీనికోసం ఊరిపేరు భైరవకోనను వాయిదా వేయించారు.
మరి వీటన్నింటినీ రవితేజ సినిమా ఎంతవరకు వాడుకుంటుందా అనేది ఆసక్తికరమే. టీజర్, ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి. మరి చూడాలిక.. ఈగల్‌కు సోలో డేట్ ఏ మేర హెల్ప్ అవుతుందనేది ఫిబ్రవరి 9న తేలనుంది.