పూరీ జగన్నాథ్‌కు ప్రస్తుతం కాస్త కష్టకాలం నడుస్తుంది. లైగర్ అనుకుంటే.. డబుల్ ఇస్మార్ట్ దాన్ని మించిన డిజాస్టర్ అయింది. దాంతో పూరీ కెరీర్ డైలమాలో పడిపోయిందిప్పుడు. ఈయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుందిప్పుడు.
ముఖ్యంగా ఏ ఆయన్ని నమ్ముతాడనే చర్చ మొదలైంది ఇండస్ట్రీలో. పూరీ చూపులు ఆ మధ్య నాగార్జున వైపు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. గతంలో శివమణి, సూపర్ లాంటి సినిమాలు ఇదే కాంబినేషన్‌లో వచ్చాయి.
సూపర్ సినిమా యావరేజ్‌గానే ఆడినా.. ఆ సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బానే ఉంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు పూరీకి నాగార్జున మరో ఛాన్స్ ఇస్తారా అనే చర్చ కూడా బాగానే జరుగుతుంది. నా సామిరంగ తర్వాత కుబేరా, కూలీ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు నాగార్జున.
హీరోగా కొత్త సినిమా ప్రకటించలేదు. దాంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నాగ్‌ను ఒప్పించే పనిలో ఉన్నారు పూరీ జగన్నాథ్. ఈ కాంబో కలవాలని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. మరి పూరీని నమ్మి నాగార్జున మరో ఆఫర్ ఇస్తారా లేదా అనేది చూడాలి.
నాగార్జునతో పాటు డిజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డతోనూ సినిమా కోసం ట్రై చేస్తున్నారు పూరీ జగన్నాథ్. తన కథ ఆ కుర్ర హీరోకు బాగా సెట్ అవుతుందని నమ్ముతున్నారీయన. అయితే డబుల్ ఇస్మార్ట్‌ను పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన తీరు చూసాక.. ఆయనతో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు హీరోలు. మరి ఈ టైమ్‌లో పూరీ బౌన్స్ బ్యాక్ ఎలా అవుతారో చూడాలిక.