
నాలుగేళ్ళ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపించారు సిద్ధార్థ్, అదితి రావు హైదరీ. చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ ఆ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి పీటలెక్కారు. మరి సిద్ధూ, అదితి లవ్ స్టోరీ అసలెక్కడ ఎప్పుడు మొదలైంది..? ఈ ఇద్దరి పెళ్లి ఎక్కడ జరిగింది..?

సిద్ధార్థ్, అదితి రావు ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం ఆలయంలో సిద్ధూ, అదితి పెళ్లి జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు.

వనపర్తి చివరి సంస్థానాదీశులు రాజా రామేశ్వరరావు మనవరాలే అదితి రావు. అందుకే తమ పూర్వీకులు కట్టించిన ఆలయంలోనే సిద్ధూను పెళ్లి చేసుకున్నారు అదితి రావు.

మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు సిద్దూ, అదితి. అక్కడే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అప్పట్నుంచీ బయటికి ఎక్కడొచ్చినా.. జంటగానే కనిపించారు ఈ జోడీ.

మార్చిలో వీళ్ళ నిశ్చితార్థం కూడా శ్రీ రంగాపురం గుడిలోనే జరిగింది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించనున్నారు అదితి. "నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే" అంటూ పెళ్లి అనంతరం తన ప్రేమను వ్యక్తం చేసారు అదితి రావు.

ఈ ఇద్దరికీ సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఇండస్ట్రీ కోసం త్వరలోనే పెద్ద పార్టీ అరేంజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.