
అందుకే జనవరి 9న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 30 ఏళ్ళ కెరీర్.. 68 సినిమాలు.. లెక్కపెట్టలేని క్రేజ్.. అంతులేని ఇమేజ్.. కోట్లాది మంది అభిమానం.. ఇవన్నీ విజయ్ సొంతం. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. తన చివరి సినిమా కోసం దళపతి విజయ్ భారీగానే కష్టపడుతున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక్క సినిమా చేయబోతున్నారీయన.

అదే ఇది.. అందుకే జన నాయగన్‌పై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. మన దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో.. తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు.

ఈ ఇద్దరికి కామన్ పాయింట్ రాజకీయాలు. కాకపోతే ఇక్కడ పవన్ రాజకీయాల్లో ఉంటూ.. కుదిరినపుడు సినిమాలు చేస్తున్నారు. అక్కడ విజయ్ మాత్రం అన్నీ పూర్తిచేసాకే రాజకీయం చేస్తానంటున్నారు. ఈ మధ్యే తమిళ వెట్రి కళగం పార్టీ ప్రకటించారు విజయ్. ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కూడా వచ్చింది. 2026 తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు విజయ్.

ఈలోపు ఒక్క సినిమా మాత్రం చేస్తానన్నారీయన. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌లో విజయ్ చివరి సినిమా షూట్ వేగంగా నడుస్తుంది. హెచ్ వినోద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ముందు ఇది భగవంత్ కేసరి రీమేక్ అన్నారు గానీ.. చిత్రయూనిట్ మాత్రం అలాంటిదేం లేదు.. ఇది స్ట్రెయిట్ సినిమా అని క్లారిటీ ఇచ్చింది. ఇందులో పూజా హెగ్డే, ప్రియమణి, మమిత బైజు, బాబీ డియోల్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నారు విజయ్. ఈ సినిమాను ప్యాన్ ఇండియన్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనూ భారీగానే విడుదల చేయబోతున్నారు. అంతేకాదు.. ఇది తనకు చివరి సినిమా కావడంతో అభిమానులకు కావాల్సిన చాలా సర్‌ప్రైజులు ఇందులో ఉండేలా చూసుకుంటున్నాడు విజయ్.