
చూస్తుండగానే 2024 అయిపోయింది.. 2025 వచ్చేసింది. మరి కొత్త ఏడాది వచ్చినపుడు కొత్తగా ఏయే సినిమాలు రాబోతున్నాయి.. 2025 బిగ్ మూవీస్ ఏంటి అనేది కూడా చూడాలిగా..! సంక్రాంతి నుంచే ఈసారి పాన్ ఇండియన్ దండయాత్ర మొదలు కానుంది. గేమ్ ఛేంజర్ అంటూ జనవరి 10న దేశమంతా ఛార్జ్ తీసుకుంటున్నారు రామ్ చరణ్.

పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలున్నాయి. ఇక 2025లో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో రానున్నారు. మార్చ్ 28న హరిహర వీరమల్లు విడుదల కానుంది. అలాగే ఓజిని కూడా వీలైనంత త్వరగా విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం కాస్త టైమ్ పట్టేలా ఉంది.

పవన్ మాత్రమే కాదు.. ప్రభాస్ కూడా 2025లో రెండు సినిమాలతో వచ్చే అవకాశం ఉంది. రాజా సాబ్ సమ్మర్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర షూట్ 90 శాతం పూర్తైంది. కేవలం VFX మాత్రమే బ్యాలెన్స్. అలాగే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సైతం 2025 చివర్లో విడుదల కావచ్చు.

2025లో రానున్న ప్రస్టేజియస్ సినిమాల్లో విశ్వంభర కూడా ఒకటి. బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తుంది. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం సమ్మర్‌కు షిఫ్ట్ అయింది. సంక్రాంతికి డాకూ మహరాజ్‌గా వస్తున్న బాలయ్య.. దసరాకు అఖండ 2తో రానున్నారు. 2025, సెప్టెంబర్ 25న విడుదల కానుంది ఈ సినిమా.

2024లో దేవరతో బ్లాక్‌బస్టర్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. 2025లో బాలీవుడ్ ఆడియన్స్‌ను నేరుగా కలుసుకోబోతున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి ఈయన నటిస్తున్న మొదటి హిందీ సినిమా వార్ 2 త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు వసూలు చేయడం పెద్ద మ్యాటరేం కాకపోవచ్చు.

నాని హిట్ 3 సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న VD12 సమ్మర్‌లో విడుదల కానుంది. 2025లోనే రవితేజ మాస్ జాతర, తేజ సజ్జా మిరాయ్, సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టు లాంటి క్రేజీ సినిమాలు కూడా రానున్నాయి.