
దసరాకు మూడు భారీ సినిమాలు వస్తున్నపుడే తెలుసు కచ్చితంగా థియేటర్స్ ఇష్యూ వస్తుందని..! 10 రోజులు సెలవులున్నాయి.. పండక్కి ప్రేక్షకులు ఎన్ని సినిమాలున్నా ఆదరిస్తారు అంటూ నిర్మాతలు చెప్తున్నారు కానీ.. ఆ 3 సినిమాలకు సరిపోయే స్క్రీన్స్ ఉండాలిగా..! మరి ఈ దసరా వార్‌లో ఎవరికి ఎన్ని థియేటర్స్ దక్కబోతున్నాయి..? అసలు వాళ్ల వెనక డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు..?

ఓ వైపు క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్.. మరోవైపు పొలిటికల్ సీజన్ మధ్య సినిమాలు కూడా తమ ప్రతాపం చూపిస్తున్నాయి. దసరాకు 3 భారీ సినిమాలు వస్తుండటంతో థియేటర్స్ దగ్గర సందడి మళ్లీ రిపీట్ కాబోతుంది. కొన్ని రోజులుగా స్థబ్ధుగా ఉన్న ఇండస్ట్రీకి భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు మళ్లీ ఊపిరి పోయడం ఖాయం. ఈ మూడూ రెండు రోజుల గ్యాప్‌లోనే వస్తున్నాయి.

బాలయ్య ‘భగవంత్ కేసరి’తో పాటు రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే లియో పేరుకు డబ్బింగ్ సినిమానే కానీ ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్‌లోనే ఉన్నాయి. ఇందులో భగవంత్ కేసరిని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. అయితే దిల్ రాజు బ్యాకప్‌తో కేసరి వస్తున్నాడు కాబట్టి నైజాంలో థియేటర్స్‌కు ఎలాంటి ఇష్యూస్ ఉండకపోవచ్చు.

ఇక ‘లియో’ను తక్కువంచనా వేయడానికి లేదు. ఇక్కడ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమా హక్కులు తీసుకున్నారు. పైగా థియేటర్స్ డీలింగ్‌లో నాగవంశీకి మంచి పేరుంది. కాబట్టి ఎంత పోటీ ఉన్నా లియోకు సరిపోయే థియేటర్స్ వచ్చేస్తాయంతే. పైగా షైన్ స్క్రీన్స్, అభిషేక్ అగర్వాల్‌తో పోలిస్తే సితార ఎంటర్‌టైన్మెంట్స్ నాగవంశీకే థియేటర్స్‌పై కాస్త ఎక్కువ పట్టు కనిపిస్తుంది.

టైగర్ నాగేశ్వరరావు నైజాం డిస్ట్రిబ్యూషన్ సురేష్ బాబు, ఏసియన్ సునీల్ తీసుకున్నారు. పైగా భగవంత్ కేసరి, లియో అక్టోబర్ 19న వస్తుంటే.. టైగర్ 20న రానున్నారు కాబట్టి థియేటర్స్ అడ్జస్ట్‌మెంట్ జరగొచ్చు. కానీ ఎవరికి ఎంత పట్టున్నా.. వచ్చే మూడు భారీ సినిమాలే కాబట్టి కచ్చితంగా థియేటర్స్ కోసం రచ్చ అయితే జరగడం ఖాయం. మరి వాటి అడ్జస్ట్‌మెంట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.