
ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. పోకిరి సినిమాలో మహేష్ బాబులా ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అన్నట్లు ఆన్ టైమ్ వచ్చేవాళ్లు మన హీరోలు. కానీ ఈ మధ్య ప్యాన్ ఇండియన్ మత్తులో పడి ఒక్కరు కూడా చెప్పిన తేదీకి రావట్లేదు.

ఈ మధ్య కాలంలో హిట్ 3, సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే చెప్పిన డేట్‌కు విడుదలయ్యాయి.. మిగిలినవన్నీ వాయిదాల పర్వమే. బస్సులో సీట్ కోసం ఖర్చీఫ్ వేసినట్లు.. ముందుజాగ్రత్తగా ఓ డేట్ అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్.

కానీ ఆ డేట్‌కు వచ్చేందుకు నిజంగా ప్రయత్నిస్తున్నారా అంటే లేదనే చెప్పాలేమో..? చివరి వరకు చూసి.. మరికొన్ని రోజుల్లో రిలీజ్ అనగా.. అనివార్య కారణాలతో మా సినిమా వాయిదా.. మంచి రిలీజ్ డేట్‌తో మళ్లీ కలుద్దాం అంటున్నారు మేకర్స్.

2025 సెకండాఫ్‌లో చాలావరకు భారీ సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అయిపోయాయి. ఓజి, అఖండ 2 రెండూ సెప్టెంబర్ 25నే రానున్నాయి. అయితే విశ్వంభర కోసం OG వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. చిరంజీవి కోసం పవన్ నిజంగానే డేట్ త్యాగం చేసారేమో అనుకున్నారు ఫ్యాన్స్.. కానీ అలాంటిదేం లేదని.. రూమర్స్ నమ్మకండి అంటూ వెంటనే ట్వీట్ చేసింది డివివి ఎంటర్‌టైన్మెంట్స్.

సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో కన్ఫర్మ్ అయిన డేట్స్‌పై కన్ఫ్యూజన్ మొదలవుతుంది. జులై 11న రావాల్సిన ఘాటీ చివరి నిమిషంలో మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తుంది. అలాగే కింగ్డమ్ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు. మిరాయ్, మాస్ జాతర లాంటి సినిమాలకు డేట్ లాక్ అయినా.. మేకర్స్ సైలెంట్‌గానే ఉన్నారు. దాంతో రిలీజ్ డేట్స్‌పై పెద్ద చర్చే జరుగుతుందిప్పుడు ఇండస్ట్రీలో.