కథలో దమ్ముండి... డీల్ చేయగలడు అన్న నమ్మకం కలిగిస్తే చాలు ఎక్స్‌పీరియన్స్‌తో సంబంధం లేకుండా కొత్త వారికి కూడా ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. ముఖ్యంగా సీనియర్ హీరోలంతా ఇప్పుడు కుర్ర దర్శకులతో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న రిలీజ్‌కు రెడీ అవుతున్న సీనియర్స్ సినిమాలన్ని ఇలాంటి కాంబినేషన్స్‌లోనే రూపొందుతున్నాయి.
భోళా శంకర్ సినిమాతో నిరాశపరిచిన మెగాస్టార్, నెక్ట్స్ సినిమాను ఓ కుర్ర దర్శకుడి చేతిలో పెట్టారు. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న వశిష్ఠ దర్శకత్వంలో ఫాంటసీ డ్రామాలో నటిస్తున్నారు. బింబిసార లాంటి బిగ్ హిట్ ఇచ్చిన వశిష్ఠ.. చిరు కోసం భారీ కాన్వాస్‌ను సిద్ధం చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ కూడా ఈ మధ్య రూట్ మార్చారు. గతంలో సీనియర్స్‌తోనే సినిమాలు చేసిన బాలయ్య, ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నారు. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్యతో హిట్ ఇచ్చిన బాబీ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు.
విక్టరీ హీరో వెంకటేష్ కూడా యంగ్ తరంగ్‌కే ఓటేశారు. హిట్ సిరీస్‌తో ఆకట్టుకున్న శైలేష్ కొలను డైరెక్షన్‌లో సైంధవ్ సినిమాలో నటించారు వెంకీ. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది.
ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున, మరోసారి కొత్త దర్శకుడి ఛాన్స్ ఇచ్చారు. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న నా సామి రంగ సినిమాతో విజయ్ బిన్నీ అనే కొరియోగ్రాఫర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇలా సీనియర్లంతా కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇస్తుండటంతో వెండితెర మీద కొత్త వైబ్ కనిపిస్తోందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.