
రష్మిక మందన్న 5 ఏప్రిల్ 1996న కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో సుమన్, మదన్ మందన్న దంపతులకు కొడవ హిందూ కుటుంబంలో జన్మించింది. ఒక చెల్లెలు షిమాన్ కూడా ఉంది. ఆమె తండ్రి ఒక కాఫీ ఎస్టేట్ తో పాటు.. స్వగ్రామంలో సెరినిటీ అనే ఫంక్షన్ హాల్ యజమాని. ఆమె తల్లి గృహిణి.

గోనికొప్పల్‌లోని కూర్గ్ పబ్లిక్ స్కూల్, బోర్డింగ్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తిచేసింది. ఆమె బెంగుళూరులోని M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం మరియు ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది.

2016లో కన్నడ రొమాంటిక్ కామెడీ కిరిక్ పార్టీలో రక్షిత్ శెట్టి సరసన తొలిసారిగా కథానాయకిగా నటించింది. ఇది అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2017లో అంజనీ పుత్ర, చమక్ అనే కన్నడ చిత్రాల్లో నటించింది.

2018లో బ్లాక్ బస్టర్ చలో సినిమాతో తెలుగు చలన చిత్రం అరంగేట్రం చేసింది. తర్వాత నటించిన గీత గోవిందం కూడా విజయాన్ని సాదించింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

2021లో పుష్ప సినిమాలో కథానాయకిగా నేషనల్ క్రష్ అయిపొయింది రష్మిక. తర్వాత సీతరామంలో ముఖ్య భూమిక పోషించింది. మిషన్ మజ్నుతో హిందీలో అడుగుపెట్టింది. 2023లో యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ తో హిందీలో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది.