
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్‌ఎమ్ కీరవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

1991లో వచ్చిన రాంగోపాల్‌వర్మ ‘క్షణ క్షణం’ మువీ కీరవాణి కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది కదా అప్పటికీ, ఇప్పటికే అదే కాన్ఫిడెంట్‌తో ఉన్నారా? అనే ప్రశ్నకు కీరవాణి సమాధానం ఇస్తూ..

‘మీకొక విషయం చెప్పాలి. రాంగోపాల్‌వర్మ నా మొదటి ఆస్కార్. 2023లో నేను అందుకున్న ఆస్కార్ రెండోది. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఎంతో మందిని కలిశాను. వాళ్లలో కొందరు నేను చేసిన ట్యూన్‌ల క్యాసెట్‌ను చెత్తబుట్టలోకి విసిరేశారు కూడా. కొందరికి నా ట్యూన్స్ నచ్చినా అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు'

'ఆ సమయంలో 'శివ' వంటి హిట్ మువీలను రూపొందించిన రాంగోపాల్‌వర్మ కొత్తగా వచ్చిన నాకు తన ‘క్షణక్షణం’ సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చారు. రాంగోపాల్‌వర్మ శివ మువీ ఒక రకంగా ఆయన సాధించిన ఆస్కార్. అది ఎంత పెద్ద హిట్ కొట్టిందో తెల్సిందే. అలాంటి వర్మ నా కెరీర్‌లో ఆస్కార్ పాత్ర పోషించారు. అందుకే.. ఆయనే నా మొదటి ఆస్కార్'

'అప్పటివరకూ కీరవాణి అంటే ఎవరికీ తెలియదు. వర్మతో కలిసి కీరవాణి పనిచేస్తున్నాడంటే అతనిలో ఏదో ట్యాలెంట్ ఉండబట్టే అవకాశం ఇచ్చారని అనుకున్నారు. ఆ ఏడాది నాకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయని కీరవాణి వర్మను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ వీడియోను వర్మ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ ‘నాకు చనిపోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఎందుకంటే చనిపోయిన వాళ్లనే ఇంత గొప్పగా పొగుడుతారంటూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్న ఎమోజీలను తన ట్వీట్‌లో పేర్కొన్నారు.